యోగా చేసేటప్పుడు ఆ 'మంత్రం' కంపల్సరీ కాదు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమంలో 'ఓమ్'ను, ఇతర వైదిక మంత్రాలను పాఠించడం తప్పనిసరి కాదని, ఈ విషయంలో ఎవరి అభిమతం మేరకు వారు వ్యవహరించవచ్చునని కేంద్ర ఆయూష్ మంత్రిత్వశాఖ తాజాగా స్పష్టం చేసింది.
అంతర్జాతీయో యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే 45 నిమిషాల యోగా కార్యక్రమంలో 'ఓమ్'తోపాటు ఇతర వైదిక మంత్రాలను మొదటగా పాఠించాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ సర్క్యులర్ వివాదాస్పదమయ్యే అవకాశముందని పేర్కొన్నాయి. సిక్కులు, బౌద్ధులు, ముస్లింలు 'ఓమ్' అని పాఠించడం మతపరంగా ఇబ్బందిగా భావిస్తారని, దీనిని తప్పనిసరి చేయరాదని జేడీయూ నేత కేసీ త్యాగీ కేంద్రానికి సూచించారు. ఈ నేపథ్యంలో ఆయూష్ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ గనెరివాలా మాట్లాడుతూ 'యోగా కార్యక్రమం ప్రారంభానికి ముందు 'ఓమ్' అని పాఠించడం తప్పనిసరి కాదు. ఇది స్వచ్ఛంద అంశమే. ఎవరైనా కావాలంటే మౌనంగా ఉండవచ్చు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఈ విషయంలో మీడియా కథనాలు యోగా దినోత్సవాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తున్నాయి. 'ఓమ్' మంత్రం యోగాలో సమగ్రభాగం. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పాఠించాలని ఎలాంటి నిబంధనలు లేవు' అని చెప్పారు.