రాజ్యాంగ లక్ష్యాలను చేరడంలో అంతా విఫలం
సాక్షి, హైదరాబాద్ : మహోన్నతమైన రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను సాధించడంలో పాల కులు, రాజకీయ పార్టీలు, విఫలమయ్యాయని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే అన్నారు.స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వం వంటి ఆశయ సాధనలో అన్ని యంత్రాంగాలు వైఫల్యం చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం,నిరుద్యోగం, నిరక్షరాస్యత ఇంకా పట్టిపీడిస్తూనే ఉన్నాయని చెప్పారు. మంథన్ స్వచ్చంద సంస్థ శుక్రవారం నిర్వహించిన మంథన్ సంవాద్ మూడో ఎడిషన్ కార్యక్రమంలో ఆయన ‘కాన్స్టిట్యూషన్-ది లాస్ట్ రిలీజియన్’అనే అంశంపై మాట్లాడారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల కృషి ఫలితంగా రూపొందిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, దాని లక్ష్యాలను సాధించుకొనేందుకు ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించాలని చెప్పారు.దే శంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మహాత్మాగాంధీ ఉన్నా ఏ మాత్రం సంతృప్తి చెందేవారు కాదన్నారు.ఎంతో సుదీర్ఘమైన మేధోమధనం జరిపి రూపొందించిన ‘రాజ్యాంగం’ ప్రజలకు గొప్ప బహుమతన్నారు.అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అన్ని మతాల ప్రజలు సమాదరించాలన్నారు.మైనారిటీ ప్రజల భద్రతకు మెజారిటీ ప్రజలు భరోసా ఇవ్వాలని సూచిం చారు.
దేశంలో ఇప్పటికీ 50 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు, నైతికతపై అవగాహన లేకపోవడ ం వల్లనే సుపరిపాలన లభించడం లేదన్నారు. నిరక్ష్యరాస్యత, అసమానతలు, పేదరికం తాండవిస్తున్నాయని చెప్పారు. అనేక సామాజిక అంశాలపై లోతైన చర్చలు జరిపేందుకు ‘మంథన్’ వంటి సంస్థలు దోహదం చేస్తాయన్నారు. ఇలాంటి వేదికలు మరిన్ని రావాలని చెప్పారు.
ఇది స్టార్టప్ రెవల్యూషన్....
నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ ‘స్టార్టప్ రెవల్యూషన్-ఇండియాస్ సిల్వర్ బుల్లెట్’ అనే అంశంపైన ప్రసంగించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనూహ్యంగా ముందుకు వస్తున్నారని,నిత్యావసర వస్తువుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వరకు ఒక విప్లవాత్మకమైన అభివృద్ధిని, మార్పును ప్రస్తుతం చూడగలుగుతున్నామని అన్నారు. ఈ చర్యల వల్ల ఉద్యోగ,ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇప్పుడు ‘స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా’ ప్రధాన నినాదమైందన్నారు. రెండు దశాబ్దాలుగా ఐటీ రంగం అద్భుతమైన పురోగతిని సాధించిందన్నారు.
హైదరాబాద్, బెంగళూర్,చెన్నై వంటి నగరాల్లో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించాయన్నారు. ప్రముఖ పాత్రికేయుడు హిందోళ్సేన్ గుప్తా మాట్లాడుతూ, దళితుల జీవితాల్లోను మార్పు వచ్చిందని, దళిత ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రగతి బాటలో పయనిస్తున్నారన్నారు.మరో పాత్రికేయ ప్రముఖుడు చంద్రభాన్ ప్రసాద్‌తో కలిసి చేసిన సర్వేలను గురించి ఈ సందర్భంగా వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక గ్రామాల్లో ఒకప్పుడు సామాజిక వివక్షతను, అణచివేతను ఎదుర్కొన్న దళితులు గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో దళితులకు మరింత ప్రోత్సాహాన్ని అందించి ముందుకు నడిపించవలసిన అవసరముందన్నారు.
మహిళలను చూసే దృక్పథం మారాలి ...
దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నప్పటికీ సామాజిక రంగంలో రావలసిన మార్పు ఇంకా రాలేదని, సమాజంలో మహిళలపై హింస,అణచివేత ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ప్రముఖ సామాజిక కార్యకర్త, నృత్యకారిణి మల్లికా సారాభాయి ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతలా కొనసాగుతున్న స్త్రీపురుష అసమానతలను తొలగించేందుకు మగవారివైపు నుంచే కృషి జరగాలన్నారు. మహిళల పట్ల మగవాళ్ల దృక్పథంలో మార్పు రావాలన్నారు. స్త్రీపురుష సమానత్వాన్ని సాధించేం దుకు పంచవర్ష ప్రణాళికలా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఉద్యమస్థాయిలో కృషి చేయవలసి ఉందన్నారు. అంతకుముందు ఆమె గాంధీజీ సిద్ధాంతాల ఆధారంగా మహిళలు ఏవిధంగా సాధికారత సాధించవచ్చో ‘శివక్రాంతి’ అనే నృత్యరూపకం ద్వారా ఆవిష్కరించారు. కర్ణాటక సంగీతగాయకుడు, రచయిత టీఎం కృష్ణ ‘సంస్కృతి, సమాజం, రాజ్యం’ అనే అంశంపై ప్రసంగించారు.