మనుషుల్లో టీబీని గుర్తించే ఎలుకలు
బ్రస్సెల్స్: శిక్షణ పొందిన ఎలుకల ద్వారా మందుపాతరలను కచ్చితంగా గుర్తిస్తూ వచ్చిన అపోపో (ఏపీఓపీఓ) అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు ఆఫ్రికాకు చెందిన ఎలుకలకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనుషుల్లో టీబీ (ట్యూబర్క్లోసిస్)ని కచ్చితంగా గుర్తిస్తోంది. కొన్ని కేసుల్లో ల్యాబ్ టెక్నీషన్ కూడా టీబీని గుర్తించడంలో విఫలం చెందవచ్చని, కానీ తమ సంస్థ డాక్టర్లు శిక్షణ ఇచ్చిన ఎలుకలు మాత్రం టీబీని కచ్చితంగా గుర్తిస్తున్నాయని అపోపో, అమెరికా డెరైక్టర్ చార్లీ రిక్టర్ తెలియజేస్తున్నారు. ఓ మనిషిలో టీబీని గుర్తించాలంటే ల్యాబ్ టెక్నీషన్కు కనీసం నాలుగు రోజులు పడుతోందని, అదే శిక్షణ పొందిన ఓ ఎలుక 20 నిమిషాల్లో వంద శాంపుళ్లను గుర్తిస్తుందని రిక్టర్ వివరించారు. చాలా చౌకైన ఈ విధానాన్ని ప్రస్తుతం టాంజానియా, మొజాంబిక్ జైళ్లలో అమలు చేస్తున్నామని, త్వరలోనే ఈ విధానాన్ని ఈ దేశాల్లోని అన్ని జైళ్లలో అమలు చేస్తామని ఆయన తెలిపారు.
పేద దేశాలకు ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. కఫంలోని శ్లేష్మం వాసనను పసిగట్టడం ద్వారా ఎలుక టీబీని గుర్తిస్తుందని, శాంపిల్‌లో టీబీ ఉన్న విషయాన్ని గుర్తించినట్లయితే ఎలుక కాసేపు దానిపైనే తచ్చాడుతుందని ఆయన వివరించారు. అయితే ఎలుక ద్వారా టీబీని గుర్తించే విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం లేదు. ఏ కొత్త విధానమైనా ల్యాబరేటరీ టెస్ట్‌లకు నిలబడాలని, కచ్చితమైన డాటా ఉండాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదన. వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా ఎయిడ్స్ తర్వాత ఎక్కువ మంది టీబీ కారణంగా మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 90 లక్షల మంది టీబీ బారిన పడుతుంటే అందులో 20 లక్షల మంది మరణిస్తున్నారు.