న్యూయార్క్ ఫ్యాషన్ షోలో సీఎం భార్య!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ గురువారం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ మీద కనిపించనున్నారు. పుణెకు చెందిన ఓ డిజైనింగ్ ఇన్ స్టిట్యూట్ తరఫున ఆమె షోస్టాపర్ గా కనువిందు చేయనున్నారు. బాలికల విద్యను, చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ఆమె ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
యువ డిజైనర్ల ప్రతిభను చాటేందుకు పుణెకు చెందిన ఛేసా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ సంస్థ ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో రైతులు, కూలీల పిల్లలు రూపొందించిన చేనేత వస్త్రాలను ప్రదర్శించనున్నారు. ఇండో-వెస్ట్రన్ శైలిలో రూపొందించిన ఓ విశిష్టమైన చేనేత వస్త్రాన్ని ధరించి అమృత ఫడ్నవిస్ ర్యాంప్ మీద కనిపించనున్నారు.
'బాలికల విద్యను ప్రోత్సహించాలన్న సందేశంతో నేను ర్యాంప్ మీద నడవబోతున్నాను. నిజానికి ఈ చేనేత వస్త్రాలను రైతులు, రైతు కూలీల పిల్లలు రూపొందించారు. వారి ప్రతిభను లోకానికి చాటే ఈ కార్యక్రమం గొప్ప వినూత్నమైనది. ఒక బాలికను చదివిస్తే కుటుంబాన్ని చదివించినట్టు అవుతుంది. కుటుంబమంతా విద్యావంతులైతే అప్పుడు దేశం పురోగమిస్తుంది.' అని అమృత ఫడ్నవిస్ మీడియాతో తెలిపారు. గతంలో గిరిజన కళలతో కూడిన చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేసిన ఆమె.. ఈసారి యువ డిజైనర్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నట్టు తెలిపారు.