Chattisghad State
-
మహదేవ్ బెట్టింగ్ స్కామ్: కీలక నిందితుడి అరెస్టు!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో ప్రధాని నిందితుడు రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో ఇంటర్‌పోల్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రవిని భారత్ తీసుకువచ్చేందుకు ఈడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రాయ్‌పూర్ పీఎంఎల్ఏ కోర్టులో ఇప్పటికే ఈడీ రవి ఉప్పల్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రవి తన భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకోకుండానే వనాతు ఐలాండ్ పాస్పోర్టుతో దుబాయ్‌లో ఉంటున్నట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో రూ.6 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఈడీ పేర్కొంది. ఆశిమ్ దాస అనే కొరియర్ ద్వారా రూ.508 కోట్ల ముడుపులను మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాగేల్కు చెల్లించారని అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయగా దీనికి పూర్తి విరుద్ధంగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇదీచదవండి..డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్ -
అంగట్లో ఆడపిల్ల: ఏడు నెలల్లో ఏడు సార్లు
భోపాల్: మార్కెట్లో ఓ సరుకు మాదిరి అమ్మాయిల జీవితం అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ అమ్మాయిని ఏడు నెలల కాలంలో ఏడుసార్లు అమ్మకానికి పెట్టారు. ఆ ఏడుసార్లు ఒక్కొక్కరు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. చివరకు ఒకతను మానసిక దివ్యాంగుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అవమానంగా భావించిన ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. దీనికి కారకులైన 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్కు చెందిన ఓ 18 ఏళ్ల యువతి తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉండేది. అయితే ఆమె వ్యవసాయ పనులు చేయడం ఇష్టం లేని ఓ బంధువు ఆమెకు మంచి ఉపాధి చూపిస్తానని చెప్పాడు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు తీసుకెళ్లింది. అక్కడ ఆమెను కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు ఆ యువతి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్వులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టి ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకెళ్లిన దంపతులే బెదిరింపులకు పాల్పడిన వారు కావడం గమనార్హం. ఆ దంపతులు ఏడు నెలల కిందట రూ. 20 వేలకు ఛత్తార్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆ అమ్మాయిని విక్రయించారు. అక్కడి నుంచి వేరొకరు.. అటు నుంచి ఇతరులు. ఇలా ఏడు నెలల కాలంలో ఆమెను ఏడు మందికి విక్రయించారు. చివరకు ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన సంతోశ్ కుష్వాహాకు రూ. 70 వేలకు ఆ బాలికను విక్రయించారు. సంతోశ్ తన కుమారుడు బాబ్లూ కుష్వాహా (మానసిక దివ్యాంగుడు)కు ఆ యువతినిచ్చి బలవంతంగా పెళ్లి చేశాడు. దీంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురయి గతేడాది సెప్టెంబర్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 8మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ యువతి విషాద జీవితం గురించి తెలిపారు. -
చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టుల ఎన్కౌంటర్
చత్తీస్‌గఢ్: పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన కాంకర్ జిల్లా తడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ పి. సుందర్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా రిజర్వ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాసేపటి తర్వాత అవతలి వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అనంతరం మొదట కాల్పులు ప్రారంభమైన చోటుకి వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వాటితో పాటు రెండు ఎస్ఎల్ఆర్ తుపాకులు, ఒక .303 రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని డీఐజీ వివరించారు. -
బంగారంలాంటి మనసు!
ఆమె సుపరిచిత ఉద్యమకారిణి కాదు.ఉపన్యాసకురాలు అంతకంటే కాదు.ఒకమంచి పనిచేయడానికి ఉద్యమించే స్వభావం, ఉర్రూతలూగించే ఉపన్యాస చాతుర్యం అవసరమే కావచ్చుగానీ అవి లేకపోయిన ‘చిత్తశుద్ధి’, ‘నిబద్ధత’ ఉంటే చాలు నిశ్శబ్దంగా కూడా సమాజానికి పనికొచ్చే మంచి పని చేయవచ్చని నిరూపించారు కాజల్ రాయ్.ఛత్తిస్ఘడ్ రాష్ట్రం జష్పూర్ జిల్లాలోని సన్నా గ్రామానికి చెందిన కాజల్ వార్డ్ మెంబర్. ఊళ్లో సగానికి మందికి పైగా ‘బహిరంగ మలవిసర్జన’ అలవాటు ఉంది. ఈ అలవాటును మాన్పించడానికి ఒక తనవంతుగా ఏంచేయాలి? అని ఆలోచించి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించింది.ఆమె ప్రచారం కొద్దిమందికి నచ్చింది. కొద్దిమందికి చాదస్తంగా అనిపించింది.నచ్చిన వాళ్లు అప్పో సప్పో చేసి మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. నచ్చని వాళ్లు మాత్రం వెటకారం చేయడం, సాకులు వెదకడం ప్రారంభించారు. ‘సర్కార్కేం? ఎన్నయినా చెబుతుంది. మా దగ్గర డబ్బు ఉండద్దూ’ అని కొందరంటే...‘మా తాతముత్తాతలు పొద్దున లేచి వనాలకే పోయారు. మేమూ అదే చేస్తున్నాం. కొత్తగా ఇదేమిటి?’ అని కొందరు దీర్ఘాలు తీశారు.అందరికీ ఓపికగా సమాధానం చెప్పింది కాజల్. ‘బహిరంగ మలవిసర్జన’ అలవాటు పూర్తిగా తొలగిపోవాలనే మన లక్ష్యం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరు పూనుకోవాలి అని చెప్పింది. ‘మరుగుదొడ్డి అంటే నాలుగు గోడల నిర్మాణం కాదు... మన ఆత్మాభిమానానికి నిలువెత్తు ప్రతీక’ అని ఆమె చెప్పిన మాట చాలామందిని సూటిగా తాకింది.‘‘నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఇంటి దగ్గర మరుగుదొడ్డి కట్టుకోవాలని నాకు కూడా ఉంది. కాని మా పరిస్థితి నీకు తెలుసు కదా తల్లీ’’ అన్నారు కొందరు.అప్పుడు ఆలోచనలో పడిపోయింది కాజల్.ప్రార్థించే పెదవులతో పాటు సహాయం చేసే చేతులు కూడా కావాలి. అప్పుడు ఆమెలో ఒక కొత్త ఆలోచన చోటు చేసుకుంది. ‘బహిరంగ మలవిసర్జన మానండి. మరుగుదొడ్లు కట్టుకోండి’ అని పదేపదే పోరే బదులు ‘నా దగ్గర ఇంత డబ్బుంది. మీకు సహాయపడగలను’ అని చెబితే బాగుంటుంది కదా అనుకుంది. కాని తన దగ్గర మాత్రం డబ్బులు ఎక్కడివి?వెంటనే తన దగ్గర ఉన్న నగలు గుర్తుకువచ్చాయి. వాటిని తాకట్టు పెట్టడం ద్వారా వచ్చిన సొమ్ముతో గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించడానికి అవసరమైన సహాయం చేయడానికి రంగంలోకి దిగింది. ముందు తన వార్డ్ నుంచి పని మొదలుపెట్టింది. ఇప్పటి వరకు వందకుపైగా టాయిలెట్ల నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని అందించింది కాజల్ రాయ్. కాజల్ గురించి విన్న జిల్లా ఉన్నతాధికారులు ఆమెకు ‘నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’లో భాగంగా ఇటుకల తయారీలో శిక్షణలను ఇప్పించారు. తాను నేర్చుకున్న విద్యను ఇతర మహిళలకు కూడా నేర్పించి టాయిలెట్లు నిర్మించుకోవాలనుకునేవారికి అవసరమైన ప్రాథమిక వస్తువులను తయారుచేసుకోవడానికి వీలు కల్పించింది కాజల్.ఇటుకల తయారీ మాత్రమే కాదు... సొంతంగా టాయిలెట్లు నిర్మించుకోవాలనుకునేవారికి, స్టెప్ బై స్టెప్ ఎలా నిర్మించుకోవాలో నేర్పించింది కాజల్. ‘‘నగలు తాకట్టు పెట్టి నువ్వు చాలా పిచ్చి పని చేశావు’’ అంటూ బాధ పడ్డారు చుట్టాలు పక్కాలు.‘‘గవర్నమెంట్ నీకు మంత్రి పదవి ఏమైనా ఇస్తుందా ఏమిటి?’’ అని ఆటపట్టించే ప్రయత్నం చేశారు కొందరు.నగలు తాకట్టు పెట్టినందుకు బాధపడలేదు.సూటిపోటి మాటలకు వెనకడుగు వేయనూ లేదు.‘‘నేను చేసిన పని వల్ల మంచి జరిగితే చాలు’’ అనుకుంది కాజల్.ఒక వార్డ్ మెంబర్‌గా కాజల్ రాయ్ పేరు సన్నా గ్రామానికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం జష్పూర్ జిల్లాతో పాటు ఛత్తిస్ఘడ్ రాష్ట్రం మొత్తానికి ఆమె పేరు సుపరిచితం అయింది.‘‘నా మెడలో ఉన్న హారం కంటే... నా గ్రామంలో ఉన్న మరుగుదొడ్డిని చూసి గర్వపడతాను’’ అంటున్న కాజల్ రాయ్ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.