విభజన పాపం వారిదే
సాక్షి, నెల్లూరు: విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని సింహపురి వాసులు ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందన్నారు. విభజన ప్రకటన ఉపసంహరించుకునే వరకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఎవరెటు’ చైతన్యపథం చర్చావేదికకు ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు హాజరయ్యారు. విభజన జరిగితే అన్నివర్గాల వారు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలు రెండు కళ్ల ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. సీమాంధ్ర నేతల రాజీనామాల విషయమై చిత్తశుద్ధి కరువైందని ధ్వజమెత్తారు. సోనియా వద్ద మోకాళ్లపై కూర్చుని తమ పదవులు కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో, నిరంకుశ పాలనలో బతుకుతున్నామో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
సీమాంధ్రులు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే, ఇప్పుడు ఆ మహానగరాన్ని తెలంగాణకు ధారాదత్తం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ బలమైన రాష్ట్రాన్ని బలహీనంగా మార్చి ఆటాడించాలని కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ఎం.శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే నిధుల విడుదల గగనమైపోతుందన్నారు. బొల్లినేని ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఏవీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే పూర్తిస్థాయి వైద్యం అందుబాటులో ఉందని చెప్పారు. విభజనే జరిగితే సీమాంధ్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.