స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
ఏలూరు అర్బన్ : స్కూల్ బస్‌లు పూర్తి కండిషన్లో లేకుంటే సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎస్ మూర్తి హెచ్చరించారు. రవాణా శాఖ అధికారులు 6 బృందాలుగా ఏర్పడి మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కూల్ బస్‌లను తనిఖీ చేశారని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్‌లను గుర్తించి సీజ్ చేశారన్నారు. సంబంధిత విద్యాసంస్థల నుంచి రూ.లక్ష వరకు అపరాధ రుసుం వసూలు చేశామని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గడువు ముగి సిన అన్ని విద్యాసంస్థల బస్‌లకు విధిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బస్‌లు తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోమని స్పష్టం చేశారు. ఏలూరు నగరంలో ఆర్టీఓ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఏఎంవీఐలు ఎం.పౌల్‌రాజు, సిద్ధిఖ్, చైతన్యసుమ, ప్రసాద్ తనిఖీలు చేశారు.