ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు, పానగల్, చందనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. వర్షం కారణంగా ధాన్యం తడిసిందేమోనని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలించే విధంగా ప్రణాళికలను రూపొందించాలని ఆర్డీఓ వెంకటాచారిని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఎన్ని క్వింటాళ్లు మిల్లులకు తరలించారు. ఇంకా ఎన్ని క్వింటాళ్లు తరలించాలి?, ఇంకా ఎంత ధాన్యం వస్తుంది ? రైతులకు డబ్బులను చెల్లిస్తున్నారా తదితర వివరాలను కేంద్రాల ఇన్చార్జిలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని వెంటను కొనుగోలు చేసే విధంగా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఏర్పాటు చేయాలని, హామాలీలను పెంచాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం నుంచి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి కేంద్రాలకు సరిపడా లారీలను ఏర్పా టు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. కొంతమంది మిల్లర్లు ధాన్యం కోటా అయిపోయిందని దించుకోవడానికి ఇబ్బందిపెడుతున్నారని కేంద్రాల ఇన్చార్జిలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కలెక్టర్ స్పందించి మిల్లర్లతో మాట్లాడి అదనపు కోటాను కెటాయించి ధాన్యాన్ని త్వరితగతిన దించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.