జిల్లాకు సుప్రీంకోర్టు బృందం
22, 23 తేదీల్లో పాఠశాలల తనిఖీ
ప్రధానంగా మరుగుదొడ్లు, తాగునీటి
సౌకర్యాలపై దృష్టి అప్రమత్తమైన విద్యాశాఖాధికారులు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై సుప్రీం కోర్టు నియమించిన ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో తనిఖీకి రానుంది. ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లాలో పర్యటించనుంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీటి కల్పనతో పాటు ఇతర అవసరాలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్)ద్వారా ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తోంది.
పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా ఈ నిధులు ఖర్చు చేసి విద్యార్థులకు సదు పాయాలను కల్పించాల్సి ఉంది. అయితే నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం మినహా క్షేత్ర స్థాయిలో మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీటి వసతుల కల్పన కలగానే మిగిలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా వాటిలో పూర్తిస్థాయిలో వినియోగంలో ఉన్నవి కేవలం 30 శాతం మాత్రమే. నిర్వహణ లోపంతో అవి శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేకపోవడం, నీటి సదుపాయం ఉన్నచోట పరిశుభ్రత పాటించకపోవడంతో ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. ఈ తరహా వాటిపై ఇటీవల సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది.ఈ క్రమంలో పాఠశాలల్లో ఆయా వసతుల కల్పనకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన బృందం స్వయంగా పరిశీలనకు రానుంది. జిల్లాలో సుప్రీం కోర్టు బృందం పర్యటిస్తుందనే సమాచారంతో విద్యాశాఖాధికారులు ఒక్కసారిగా కదిలారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో కేవీ శ్రీనివాసులు రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరుగు దొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.సుప్రీంకోర్టు బృందం పర్యటనతోనైనా జిల్లాలోని పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉన్నదేమో చూడాలి.