checkbounce case
-
శరత్‌కుమార్, రాధిక దంపతులకు ఏడాది జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెక్‌బౌన్స్ కేసులో నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతులకు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు ఇలా.. శరత్‌కుమార్, రాధిక భాగస్వాములుగా ఉన్న మేజిక్ ఫ్రేమ్స్ సంస్థ ‘ఇదు ఎన్న మాయం’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్ర నిర్మాణం కోసం రాడియన్స్ అనే సంస్థ నుంచి 2014లో రూ.15 కోట్లు అప్పు తీసుకున్నారు. 2015 మార్చిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అప్పు తీర్చని పక్షంలో టీవీ ప్రసార హక్కులు లేదా ఆ తరువాత నిర్మించే చిత్ర హక్కులను ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అదనంగా రూ.కోటి అప్పుతీసుకుని చెన్నై టీనగర్‌లోని ఆస్తిని తాకట్టుపెట్టారు. ఆ డబ్బుతో ‘పాంబు సట్టై’ అనే మరో చిత్రాన్ని నిర్మించి ఒప్పందానికి కట్టుబడనందున తమకు రావాల్సిన రూ. 2.50 కోట్లు వడ్డీ సహా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని, టీ నగర్ ఆస్తులు అమ్మకుండా నిషేధం విధించాలని రాడియన్స్ సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. డబ్బు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో శరత్‌కుమార్, రాధిక కలిసి 7 చెక్కులను రాడియన్స్ సంస్థకు అందజేశారు. శరత్‌కుమార్ దంపతుల బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోవడంతో వీటిలో ఒక చెక్కు బౌన్స్ అయింది. ఈ కారణంగా శరత్‌కుమార్ దంపతులపై, మరో భాగస్వామి స్టీఫెన్‌పై రాడియన్స్ సంస్థ చెన్నై సైదాపేట కోర్టులో క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసును ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా, శరత్‌కుమార్, రాధిక దంపతులకు, స్టీఫెన్‌కు తలా ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే అప్పీలు కోసం శరత్‌కుమార్, స్టీఫెన్‌లకు అవకాశం ఇస్తూ శిక్షను నిలిపివేసింది. కోర్టుకు హాజరుకానందున రాధికపై పిటీ వారెంట్ జారీచేసింది. -
చెక్ బౌన్స్ కేసులు ఒక ‘వింత’
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే సరైనమార్గమని సుప్రీంకోర్టు కేంద్రానికి గురువారం స్పష్టం చేసింది. ఈ దిశలో పార్లమెంటుకు అధికారం కల్పిస్తున్న రాజ్యాంగంలోని 247వ అధికరణను వినియోగించుకోవాలని కేంద్రానికి సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని కూడా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్రభట్‌లు ఉన్నారు. నిర్దిష్ట సమయంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ (ఎన్ఐ) యాక్ట్ కేసుల పరిష్కార అవసరం ఉందని స్పష్టం చేసిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం అభిప్రాయంతో విభేదం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో చెక్‌బౌన్స్ కేసులు సత్వర పరిష్కారం అయిపోవన్న కేంద్రం అభిప్రాయంతో ధర్మాసనం విభేదించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్) తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీ తన వాదనలు వినిపిస్తూ, నిందితులు కోర్టులకు హాజరుకాకపోవడం వల్లే ఎన్ఐ యాక్ట్ కేసులు భారీగా పెండింగులో ఉంటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు వల్ల తగిన ప్రయోజనం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతక్రితం ఈ కేసులో స్వతంత్ర సలహాదారుగా ఉన్న సిద్ధార్థ్ లుథ్రా కూడా డీఎఫ్ఎస్ వాదలను కొట్టిపారేశారు. చట్ట ప్రక్రియ సజావుగా సాగడానికి 247వ అధికరణను కేంద్రం వినియోగించుకోవచ్చని తన వాదనల్లో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం బిహార్‌లో పెండింగులో ఉన్న వందలాది బెయిల్ మేటర్లను కూడా ప్రస్తావించడం విశేషం. లిక్కర్ ప్రొహిబిషన్ యాక్ట్ తర్వాత బిహార్‌లో ఈ తరహా పరిస్థితి నెలకొందని బెంచ్ పేర్కొంది. వాదనల తర్వాత అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీ కూడా చెక్‌బౌన్స్ కేసులపై సుప్రీం సూచనలను స్వాగతించడం గమనార్హం. సుప్రీం అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. అయితే దీనిపై మరింత చర్చ అవసరమని పేర్కొన్నారు. ‘‘ఈ అంశంపై మేము ముందుకు వెళతాం. అయితే ప్రభుత్వం తొలుత ముందుకు రావాలని కోరుతున్నాం’’ అని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘2005 నాటి కేసు విచారణ’ నేపథ్యం.. చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సూ మోటోగా (తనకు తానుగా) ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లుథ్రా, అడ్వకేట్ కే. పరమేశ్వర్లు నియమితులయ్యారు. కేసులో ఇప్పటికే కేంద్రం, హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్, డీజీపీలు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును బుధవారం ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది. -
చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం ఎలా?
న్యూఢిల్లీ: కోర్టుల్లో భారీగా పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం ఎలా అన్న అంశంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు, ఈ అంశంపై సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును బుధవారం ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి వివిధ శాఖల సభ్యులు, సెక్రటరీలు, అధికారుల పేర్లను గురువారంనాటికి తెలియజేయాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, ఆర్. రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అడిషినల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని ఆదేశించింది. వివిధ మంత్రిత్వశాఖల సెక్రటరీలు, అధికారులు, సంబంధిత వర్గాలతో చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కార అంశంపై చర్చించాల్సి ఉందని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ముందు పేర్కొనడంతో, అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. 35 లక్షల పెండింగ్ కేసులు... నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ (ఎన్ఐ యాక్ట్) కేసులను సత్వరం పరిష్కరించడానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని ఫిబ్రవరి 25వ తేదీన సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసు తిరిగి బుధవారం ధర్మాసనం ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 35 లక్షల ఎన్ఐ యాక్ట్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పెండింగులో ఉన్న నేపథ్యంలో ధర్మాసనం ఈ అంశంపై దృష్టి పెట్టింది. 247వ అధికరణ కింద (అదనపు కోర్టుల ఏర్పాటుకు పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తున్న అధికరణం) ఎన్ఐ యాక్ట్ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై కేంద్రం అభిప్రాయాన్ని వారం రోజుల్లో తెలియజేయాలని ధర్మాసనం గత నెల 25న అడిషినల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీని ఆదేశించింది. చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యం లో సుప్రీంకోర్టు సూ మోటోగా (తనకు తానుగా) ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లుథ్రా, అడ్వకేట్ కే. పరమేశ్వర్లు నియమితులయ్యారు. -
చెక్‌బౌన్స్ కేసులో డీఎస్పీకి రూ.12 లక్షల జరిమానా
మియాపూర్ (హైదరాబాద్): చెక్కు బౌన్స్ కేసులో ఓ డీఎస్పీకి రూ.12 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ మియాపూర్‌లోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి త్యాగరాజ నాయుడు గురువారం తీర్పునిచ్చారు. గతంలో కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏసీపీగా పనిచేసిన నాగరాజు ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2012లో ఇళ్లు కొనుగోలు విషయంలో కేపీహెచ్‌బీకి చెందిన బిల్డర్ ఉమాకు రూ.6 లక్షలకు రెండు చెక్కులను డీఎస్పీ నాగరాజు ఇచ్చారు. ఆ రెండూ బౌన్స్ కావడంతో ఉమా మియాపూర్ కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాదోపవాదాల మధ్య కేసు కొనసాగింది. రూ.6 లక్షలకు మరో ఆరు లక్షలు మొత్తం రూ.12 లక్షల జరిమానా నెల రోజుల్లో చెల్లించాలని, రెండు చెక్ బౌన్స్‌లకు 3 నెలల చొప్పున మొత్తం 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. డబ్బు చెల్లించని పక్షంలో మరో 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారని న్యాయవాది జాగర్లమూడి శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే డీఎస్పీ నాగరాజు కోర్టులోనే రూ.3 లక్షలు చెల్లించటంతో పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారన్నారు.