చెడ్డానగర్ వద్ద ఫ్లైఓవర్లు
సాక్షి, ముంబై: చెడ్డానగర్ జంక్షన్ వద్ద రద్దీని నియంత్రించేందుకు మూడు ఫ్లై ఓవర్లు, ఒక భూగర్భమార్గాన్ని నిర్మించనున్నారు. ఈ జంక్షన్ వద్ద ముఖ్యంగా సైన్, ఠాణే, మాన్ఖుర్ధ్ నుంచి వచ్చే వాహనాల వల్ల ఎక్కువ రద్దీ ఏర్పడుతోంది. దీంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారటీ (ఎమ్మెమ్మార్డీఏ) ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు మూడు ఫ్లై ఓవర్లను, ఒక భూగర్భమార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించింది.
ఇందుకు గాను ఎమ్మెమ్మార్డీఏ చేసిన అధ్యయనం మేరకు.. చెడ్డానగర్ జంక్షన్ వద్ద రోజుకు 2.63 లక్షల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. సైన్ నుంచి ఠాణే వచ్చే ప్రయాణికుల కోసం రెండు లేన్ల ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్లై ఓవర్‌కు సమాంతరంగా దీనిని నిర్మించనున్నారు. ఘాట్కోపర్-మాన్‌ఖుర్డ్ లింక్‌రోడ్ నుంచి ఠాణే వెళ్లదలచిన వాహనాల కోసం అధనంగా మరో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు.
అదేవిధంగా మాన్‌ఖుర్డ్ నుంచి సైన్వచ్చే వాహనాల కోసం భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. కానీ ఈ భూగర్భ మార్గం నిర్మాణం కోసం అధికారులు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మార్గానికి అడ్డు వస్తున్న పైప్‌లైన్‌ను తొలగించాలని కార్పొరేషన్ ఏజెన్సీలను కోరినట్లు ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు తెలిపారు. అమర్ మహల్ ఫ్లైఓవర్‌ను ఆశ్రయించే వాహన దారులకు శాంతాకృజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్) వెళ్లడానికి మాన్‌ఖుర్డ్ నుంచి సైన్ వచ్చే వాహనాల వల్ల తలనొప్పిగా మారింది.
దీంతో వాహనాలు నేరుగా ఎస్సీఎల్ఆర్కు చేరుకోవడానికి ఎమ్మెమ్మార్డీఏ ఓ ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు ప్రతిపాదించింది. అయితే ఈ ప్రణాళికకు ప్రాథమిక అనుమతి లభించినప్పటికీ చివరి ఆమోదం కోసం అధికారులు వేచి చూస్తున్నారు. రూ.225 కోట్ల ఈ ప్రాజెక్టుకు గాను ఈ ఏడాది చివరి వరకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికారి వెల్లడించారు. కాగా 2015లో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.