breaking news
cheepuru palli
-
TDP: ‘బొత్స’పై పోటీ.. తమ్ముళ్ల పరార్ !
సాక్షి,విజయనగరం: వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారయణపై పోటీకి తెలుగుదేశం సీనియర్ నేతలు వెనుకాడుతున్నారు. ప్రస్తుతం బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ అనగానే తమ్ముళ్లు జారుకుంటున్నారు. మమ్మల్ని విడిచిపెట్టండి.. మా దారి మేము చూసుకుంటాం అని పార్టీ అధినేత చంద్రబాబుకు నేతలు తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చీపురుపల్లి నుంచి పోటీచేయాలని అధిష్టానం ఇచ్చిన ఆఫర్‌ను విశాఖపట్నంనకు చెందిన కీలక నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రిజెక్ట్ చేశారు. ఇక చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని విజయనగరానికే చెందిన పార్టీ ముఖ్య నేత, గతంలో మంత్రిగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావును కోరగా ఆయన కూడా ముఖం చాటేసినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో పట్టున్న బడా నేతలే బొత్సపై పోటీ అనగానే సారీ చెబుతుండడంతో ఏం చేయాలో తోచక టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది. చేసేది ఏమీ లేక మీసాల గీత పేరును పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బొత్సపై పోటీ చేసి పార్టీ పరువును కాపాడాలని మీసాల గీతని చంద్రబాబు బతిమిలాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి టీడీపీ తరపున పోటీలో ఎవరుంటారన్నదానిపై ఆసక్తిగా మారింది. ఇదీ చదవండి.. ఏపీ బీజేపీ ఒంటరి పోరు.. పోటీకి భారీగా దరఖాస్తులు -
చీపురుపల్లిలో గ్యాస్ లొల్లి
విజయనగరం జిల్లా: సీఎస్ఆర్ పథకం ద్వారా తక్కువ ధరకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి దొరికినంత దోచుకున్నారు భారత్ గ్యాస్ డీలర్లు. ఇందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదికైంది. సీఎస్ఆర్ పథకం ద్వారా అర్హులైన వారందరు 'మీ సేవ'లో రూ. 10 చెల్లించి గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కలెక్టర్ మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు గానూ లబ్ధిదారులు రూ.1500 చెల్లించి గ్యాస్ సిలిండర్, పైపు, రెగ్యులేటర్‌ను అందిస్తారు. అయితే, భారత్ గ్యాస్ డీలర్లు మాత్రం కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా సుమారు 2,800 మంది లబ్ధిదారుల నుంచి రూ.3,100, రూ. 3,500 చొప్పున వసూలు చేశారు. మోసపోయిన లబ్ధిదారులు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఫిర్యాదు చేసేందుకు గురువారం మధ్యాహ్నం వచ్చారు. కాగా, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన లబ్ధిదారులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం విశేషం. దీన్ని బట్టి చూస్తే అధికార టీడీపీ వర్గాలకు కూడా ఈ గ్యాస్ కనెక్షన్‌తో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. (చీపురుపల్లి) -
స్థానికులా? ప్చ్..!
త్వరలో జరిగే సాధారణ ఎన్నికలు చావోరేవో అన్న నిర్ణయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎవరు దండిగా ఖర్చు పెట్టగలరో వారికే ఎంఎల్ఏ టిక్కెట్లను ఖరారు చేసే యోచనలో టీడీపీ అధినేత ఉన్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక బలం బాగా ఉన్నవారికే స్థానికులు కాకపోయినా పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు చూస్తుంటే చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎంఎల్ఏ టిక్కెట్‌ను ఆశిస్తున్న స్థానికులకు మింగుడు పడడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: పెరడులోని చెట్టు వైద్యానికి పనికిరాదన్న చందాన తయారైంది చీపురుపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల పరిస్థితి. నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల జాబితా చాంతాడంత ఉన్నా పక్క జిల్లా నేతలపైనే పార్టీ అధినేత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక నేతల కన్నా సొమ్మున్నోళ్లపైనే ఆసక్తి కనబరుస్తున్న ట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన చర్చల సారాం శం విని పార్టీ వర్గాలు విస్తుపోతున్నాయి. అయితే వారేమైనా తక్కువ తిన్నారా? తమను కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే పార్టీకి నియోజకవర్గంలో పుట్టగతులుంటాయా? చూద్దాం అంటూ అంతర్లీనంగా చెప్పుకుంటున్నారు. చాంతాండంత స్థానికుల జాబితా చీపురుపల్లి టిక్కెట్‌ను ఆశిస్తున్న స్థానిక ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. నాయకుడిగా చెలామణి అవుతున్న ప్రతి ఒక్కరూ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంఎల్ఏ టిక్కెట్టును ఆశిస్తూ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న కె.త్రిమూర్తులు రాజు, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంఎల్ఏ టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరిన మాజీ ఎంఎల్ఏ గద్దే బాబూరావుతో పాటు ఆయన కుమార్తె, ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న టిక్కెట్ తనకే దక్కుతుందన్న ఆశలో మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహనరావు, బీసీ కోటాలో టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్‌తో చీపురుపల్లి, గుర్ల మండలా ల పార్టీ అధ్యక్షులు రౌతు కామునాయుడు, వెన్నె సన్యాశినాయుడు రేసులో ఉన్నారు. వీరితో పాటు గుర్ల మండలానికి చెందిన కురిమినెల్లి బంగారునాయుడు, చీపురుపల్లి మండలానికి చెందిన వలిరెడ్డి శ్రీరాములు, మెరకముడిదాం మండలానికి చెందిన బూర్లె రవికుమార్ ఆశావహుల జాబితాలో చేరారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తున్నారు. అధినేత మదిలో మరొకరు అయితే, అధినేత చంద్రబాబు వీరిని కాదని పక్క జిల్లా నేతలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కష్టపడి రేసులో ఉన్న వారిని ఎలాగైనా ఒప్పించొచ్చని, ఒకవేళ వారు దారికి రాకపోయినా ప్రభావం చూపలేరన్న ఆలోచనతో స్థానిక నేతల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి విన్పిస్తోంది. శ్రీకాకుళం జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ కిమిడి మృణాళిని లేదంటే ఆమె భర్త గణపతిరావును అభ్యర్థిగా నిలబెట్టాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిని కాదనే పరిస్థితి వస్తే భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌ను కానీ ఆయన సోదరుడిని కానీ రంగంలోకి దించాలని కూడా మరోవైపు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. వీరి అభ్యర్థిత్వంపై ఇటీవల హైదరాబాద్‌లో చర్చ కూడా జరిగినట్టు తెలిసింది. అధినేత యోచన తెలుసుకున్న స్థానిక నేతలు అభద్రతా భావంలోకి వెళ్లిపోగా, క్యాడర్ అంతా అయోమయంలో ఉంది. స్థానిక నేతలకు కాకుండా పక్క జిల్లా నేతలకిస్తే ఇన్నాళ్లూ పడ్డ కష్టం వృథా అవుతుందని, వాళ్ల కోసం మేమెందుకు కష్టపడతామని, అధినేత ఆలోచన సరైనదని కాదని ఉసూరుమంటున్నారు.