శంషాబాద్ ఎంపీపీగా చెక్కల ఎల్లయ్య
శంషాబాద్: శంషాబాద్ మండలపరిషత్ అధ్యక్ష స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోరం లేకపోవడంతో ఇటీవల రెండుసార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలను వ న్నికల ప్రిసైడింగ్ అధికారులు ఆదివారం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం 24 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను కాంగ్రెస్ నుంచి 8, స్వతంత్రులు ముగ్గురు, ఎంఐఎం 1 తోపాటు టీడీపీకి చెందిన శంషాబాద్ ఎనిమిదో వార్డు ఎంపీటీసీ సభ్యుడు వై.సురేష్‌గౌడ్ కాంగ్రెస్ ఎంపీపీ అభ్యర్థి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ చెక్కల ఎల్లయ్యకు మద్దతు పలికారు. మరోవైపు బీజేపీ నుంచి ఎంపీపీ అభ్యర్థిగా శ్రీధర్‌ను ఆ పార్టీకి చెందిన నేతలు ప్రతిపాదించినప్పటికీ ఆయనకు 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చెక్కల ఎల్లయ్య విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.
కిరికిరి మధ్యన ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక...
ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం టీడీపీ సభ్యుడు సురేష్‌గౌడ్‌కు కాంగ్రెస్ ఉపాధ్యక్ష స్థానాన్ని ఇవ్వాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ యాదవ్ ఆ స్థానం తనకే కావాలని పట్టుబట్టాడు. శ్రీకాంత్ యాదవ్‌కు బీజేపీ, టీడీపీ నేతలు మద్దతు పలకగా, సురేష్‌గౌడ్‌కు కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్రులు మద్దతిచ్చారు. పార్టీ తనను మోసం చేసిందని, తనకే మద్దతు పలకాలని శ్రీకాంత్‌యాదవ్ ఎంపీపీ అభ్యర్థితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యంతో ఎన్నికలు నిర్వహించారు. సురేష్‌గౌడ్‌కు 12 ఓట్లు, శ్రీకాంత్ యాదవ్‌కు 12 ఓట్లు రావడంతో లాటరీ వేశారు. లాటరీలో సురేష్‌గౌడ్ పేరు రావడంతో ఆయనను ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు అధికారులు ధ్రువీకరణపత్రాలు అందజేశారు.