‘మృత్యుంజయ హోమం వైద్యవృత్తికే అవమానం’
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) :హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాలను ఆపేందుకు మృత్యుంజయ హోమం చేయడం వైద్యవృత్తికే అవమానమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. ఆధునిక వైద్యం శాస్త్రీయపరంగా చాలా అభివృద్ధి చెందిందని, వైద్యవృత్తి చేసేవారికి మానవ శరీర నిర్మాణం, జనన, మరణాలపై కనీస పరిజ్ఞానం ఉంటుందన్నారు.
వైద్యకళాశాలల్లో ఇందుకు సంబంధించిన విజ్ఞానం నేర్చుకున్న వైద్యులు గాంధీ ఆస్పత్రిలో మరణాలను ఆపేందుకు హోమాలు చేయడం అనాగరిక చర్య అని అన్నారు. గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చేసిన మృత్యుంజయ హోమం వైద్యుల మూఢ నమ్మకాలకు నిదర్శనమన్నారు. ఈ చర్యలను జనవిజ్ఞాన వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి రోగులను కాపాడాల్సిన బాధ్యత నుంచి డాక్టర్లు తప్పుకుని దేవుడిపై భారం వేయడం దారుణమని పేర్కొన్నారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు డాక్టర్ రవీంద్ర సూరి, రామ్మోహన్రావు, నర్ర రామారావు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.