Cheliyaa
-
చెలియా సినిమాలోలాగా.. అభినందన్ ..
చెన్నై: దాయాది పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాల్ని తిప్పికొట్టే క్రమంలో దురదృష్టవశాత్తూ అభినందన్ పాక్ చెరలో చిక్కుకున్నట్టు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అభినందన్ తండ్రి ఎస్ వర్థమాన్ కూడా వైమానిక దళంలో మాజీ అధికారి. వారి స్వస్థలం కేరళ అయినా.. అభినందన్ కుటుంబసభ్యులు తమిళనాడులోని తాంబరంలో స్థిరపడ్డారు. అభినందన్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అభినందన్ బందీ సమాచారం ఆయన కుటుంబీకులు, బంధువుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వైమానిక దళ అధికారులు అభినందన్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. అయితే అభినందన్ తండ్రి ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఓ చిత్రానికి సహకారం అందించాడు. అది కూడా శత్రు దేశం చెరలో చిక్కుకున్న ఓ పైలట్ కథ కావడం.. ఇప్పుడు తన కుమారుడికి కూడా ఆ చిత్రంలో చూపించిన ఓ సన్నివేశం ఎదురుకావడం యాదృచ్ఛికమనే చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. కార్గిల్ యుద్ధ సమయంలో ఓ భారత ఫైలట్ పాక్ చెరలో చిక్కుకున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘కాత్రు వెలియిడై’ (తెలుగులో చెలియా) చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కార్తీ, అదితిరావు హైదరీ జంటగా నటించారు. ‘కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ వరుణ్ చక్రవర్తి ప్రయాణిస్తున్న యుద్ధ విమానం పాక్ భూభాగంలో కూలిపోతుంది. రావల్పిండిలో పాక్ ఆర్మీ అతన్ని అదుపులోకి తీసుకుంటుంది. యుద్ద ఖైదీ అయిన వరుణ్‌ను తీవ్ర చిత్ర హింసలకు గురిచేస్తుంది. ఆ సమయంలో అతడు లీలా గురించి ఆలోచిస్తూ కాలం వెల్లదీస్తాడు’ అనేది ఈ చిత్రంలో చూపించారు. ఇందులో వరుణ్ పాత్రలో కార్తీ, లీలా పాత్రలో అదితి నటించారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్లో కూడా ఎస్ వర్థమాన్ పాల్గొన్నారు. అయితే పాక్ సైనికులకు చిక్కిన అభినందన్‌కు చెందిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై కుటుంబసభ్యులతో, దేశ ప్రజలందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభినందన్‌ను వెంటనే విడుదల చేయాలని దేశ ప్రజలంతా పాక్‌ను డిమాండ్ చేస్తున్నారు. పాక్ జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం సూచిస్తుంది. అత్యుత్తమ సేవలు అందించిన అభినందన్ తండ్రి.. ఎస్ వర్థమాన్ భారత వైమానిక దళంలో అత్యుత్తమ సేవలు అందించారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన గ్వాలియర్ చీఫ్ ఆపరేషన్ అధికారిగా విధులు నిర్వర్తించారు. 1973లో ఫైటర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో చేరిన ఆయన నలభై రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లలో నాలుగు వేలకు పైగా గంటలు ప్రయాణించారు. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన సమయంలో ఆయన పశ్చిమ ప్రాంతంలోని ఎయిర్‌బేస్ కమాండ్‌గా ఉన్నారు. అంతేకాకుండా బెంగళూరులోని ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబిలిష్మెంట్కు చీఫ్ టెస్ట్ పైలట్‌గా పనిచేశారు. -
రామ్ చరణ్ సినిమా ఆగిపోయిందా..?
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న రామ్ చరణ్, ఆ సినిమా తరువాత మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించాడు. చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు జరిగినా.. ప్రయోగం చేయడానికి ఇష్టపడని చరణ్, వాయిదా వేస్తూ వచ్చాడు. ధృవ సినిమా విషయంలో ప్రయోగం వర్క్ అవుట్ కావటంతో తరువాతి సినిమాల విషయంలో కూడా ఇమేజ్ను పక్కన పెట్టి సినిమాలు ఎంచుకుంటూన్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడా పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో ఓ క్లాస్ రొమాంటిక్ లవ్ స్టోరికి ఓకె చెప్పాడు. అయితే మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చెలియాకు డిజాస్టర్ టాక్ రావటంతో చెర్రీ ఆలోచనలో పడ్డాడు. దీంతో మణిరత్నం కూడా మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ సినిమాను హోల్డ్‌లో పెట్టి ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌లు జంటగా సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే వారికి కథ కూడా వినిపించిన మణి, త్వరలోనే ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఆ తరువాతైన చరణ్, మణిరత్నం సినిమాలో నటిస్తాడో లేదో చూడాలి. -
‘చెలియా’ ఆడియో