చెన్నై: దాయాది పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాల్ని తిప్పికొట్టే క్రమంలో దురదృష్టవశాత్తూ అభినందన్ పాక్ చెరలో చిక్కుకున్నట్టు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అభినందన్ తండ్రి ఎస్ వర్థమాన్ కూడా వైమానిక దళంలో మాజీ అధికారి. వారి స్వస్థలం కేరళ అయినా.. అభినందన్ కుటుంబసభ్యులు తమిళనాడులోని తాంబరంలో స్థిరపడ్డారు. అభినందన్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అభినందన్ బందీ సమాచారం ఆయన కుటుంబీకులు, బంధువుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వైమానిక దళ అధికారులు అభినందన్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.
అయితే అభినందన్ తండ్రి ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఓ చిత్రానికి సహకారం అందించాడు. అది కూడా శత్రు దేశం చెరలో చిక్కుకున్న ఓ పైలట్ కథ కావడం.. ఇప్పుడు తన కుమారుడికి కూడా ఆ చిత్రంలో చూపించిన ఓ సన్నివేశం ఎదురుకావడం యాదృచ్ఛికమనే చెప్పవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. కార్గిల్ యుద్ధ సమయంలో ఓ భారత ఫైలట్ పాక్ చెరలో చిక్కుకున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘కాత్రు వెలియిడై’ (తెలుగులో చెలియా) చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కార్తీ, అదితిరావు హైదరీ జంటగా నటించారు.
‘కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ వరుణ్ చక్రవర్తి ప్రయాణిస్తున్న యుద్ధ విమానం పాక్ భూభాగంలో కూలిపోతుంది. రావల్పిండిలో పాక్ ఆర్మీ అతన్ని అదుపులోకి తీసుకుంటుంది. యుద్ద ఖైదీ అయిన వరుణ్‌ను తీవ్ర చిత్ర హింసలకు గురిచేస్తుంది. ఆ సమయంలో అతడు లీలా గురించి ఆలోచిస్తూ కాలం వెల్లదీస్తాడు’ అనేది ఈ చిత్రంలో చూపించారు. ఇందులో వరుణ్ పాత్రలో కార్తీ, లీలా పాత్రలో అదితి నటించారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌లో కూడా ఎస్ వర్థమాన్ పాల్గొన్నారు.
అయితే పాక్ సైనికులకు చిక్కిన అభినందన్‌కు చెందిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై కుటుంబసభ్యులతో, దేశ ప్రజలందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభినందన్‌ను వెంటనే విడుదల చేయాలని దేశ ప్రజలంతా పాక్‌ను డిమాండ్ చేస్తున్నారు. పాక్ జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను క్షేమంగా విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం సూచిస్తుంది.
అత్యుత్తమ సేవలు అందించిన అభినందన్ తండ్రి..
ఎస్ వర్థమాన్ భారత వైమానిక దళంలో అత్యుత్తమ సేవలు అందించారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన గ్వాలియర్ చీఫ్ ఆపరేషన్ అధికారిగా విధులు నిర్వర్తించారు. 1973లో ఫైటర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో చేరిన ఆయన నలభై రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లలో నాలుగు వేలకు పైగా గంటలు ప్రయాణించారు. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన సమయంలో ఆయన పశ్చిమ ప్రాంతంలోని ఎయిర్‌బేస్ కమాండ్‌గా ఉన్నారు. అంతేకాకుండా బెంగళూరులోని ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబిలిష్‌మెంట్‌కు చీఫ్ టెస్ట్ పైలట్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment