మళ్లీ తెరపైకి చిరంజీవి - శ్రీదేవి!
హైదరాబాద్: అబ్బనీ తియ్యనీ దెబ్బ.. అంటూ కుర్రకారు గుండెల్లో హుషారెత్తించిన ఆ దృశ్యకావ్యం మళ్లీ వెండితెరపై ప్రత్యక్షం కాబోతోంది. 26 ఏళ్ల క్రితం క్రేజీ కాంబినేషన్‌తో వెండితెరపై సంచలనం సృష్టించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వెండితెరపై మెరవనుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ స్కై ఫెస్ట్ 2015లో అభిమానుల విజ్ఞప్తి మేరకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి, స్టన్నింగ్ బ్యూటీ శ్రీదేవి జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రాన్ని మళ్లీ అభిమానుల ముందుకు తేనున్నట్టు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ ప్రదర్శనను కేన్సర్ బాధితుల సహాయార్థం నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 27న 'శ్రీమంతుడు' సినిమాను ప్రదర్శించనున్నట్టు కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. తద్వారా వచ్చిన నిధులను కేన్సర్ బాధితులకు అందించనున్నామన్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమకు సహకరించాలని కోరారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అశ్వనీదత్, చిరంజీవి, శ్రీదేవిల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చిరంజీవి కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే మెగాహిట్గా నిలిచింది. చిరంజీవి, శ్రీదేవిల మధ్య కెమిస్ట్రీ, ఇళయారాజా సంగీతం, అమ్రేష్ పూరి విలక్షణ డైలాగ్ డెలివరీ సినిమా విజయానికి పెద్ద ఎసెట్‌గా నిలిచాయి. మొత్తంగా ఈ చిత్రం ఓ సుందర దృశ్యకావ్యంగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.