ధరలపై దద్దరిల్లిన అసెంబ్లీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం డీఎంకే సభ్యులు స్టాలిన్, దురైమురుగన్, డీఎండీకే సభ్యులు మోహన్‌రాజు తదితరులు ధరల పెరుగుదలపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. సభ్యులు కోరిన వివరాలను ఆయా శాఖలకు పంపామని, వారి నుంచి బదులురాగానే చర్చించేందుకు అనుమతిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. దీంతో సదరు పార్టీల సభ్యులు ఒక్కసారిగా లేచి చర్చకు పట్టుబట్టారు. వారికి పోటీగా అధికార పార్టీ సభ్యులతోపాటు మంత్రులు సైతం లేచి నిలబడి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. ఎంతకూ పరిస్థితి సద్దుమణగక పోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ వారిని బయటకు పంపేయూలని మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో మార్షల్స్ సభ్యులను బయటకు తరలించారు.
ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారంటూ ఇతర ప్రతిపక్షాలు సైతం సభ నుంచి వాకౌట్ చేశాయి. మరికొద్ది సేపటి తర్వాత మళ్లీ అసెంబ్లీ సమావేశానికి హాజరైన డీఎండీకే సభ్యులు మోహన్‌రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. డోనేషన్ల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సమయంలో విజయకాంత్ నడుపుతున్న ఆండాళ్ అళగర్ ఇంజినీరింగ్ కాలేజీల మాటేమిటని అన్నాడీఎంకే సభ్యులు కేకలు వేశారు. తమ కాలేజీలో డొనేషన్ల వసూలు చేయడం లేదని, ప్రభుత్వం సూచించిన ఫీజులనే వసూలు చేస్తున్నామని విజయకాంత్ బదులిచ్చారు. ఇందుకు విద్యాశాఖా మంత్రి పళనియప్పన్ బదులిస్తూ ప్రభుత్వ కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదుల అందడంలేదన్నారు.
ఏదో ఒకటి విమర్శించాలని మాట్లాడవద్దని హితవు పలికారు. తమ కాలేజీలో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నాడీఎంకే సభ్యులు మళ్లీ అరవగా, మీ పార్టీ వాళ్లు ఇంజినీరింగ్ కాలేజీలు నడుపుతున్నారు, వాళ్లను అడిగి తెలుసుకోండని డీఎండీకే సభ్యులు బదులిచ్చారు. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే సభ్యురాలు రాజ్యలక్ష్మి మాటలపై అసెంబ్లీలో దుమారం రేగింది. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన సభ్యురాలు డీఎంకే పార్టీపైనా, ఆ పార్టీ అధినేత కరుణానిధి, వారి కుటుంబ సభ్యులపైనా విమర్శలు చేస్తున్నారంటూ డీఎంకే సభ్యులు దురైమురుగన్ దుయ్యబట్టారు. సభ్యులంతా లేచి నిలబడి రాజ్యలక్ష్మి మాటలకు నిరసన తెలిపారు. ఆమెకు మద్దతుగా అధికార సభ్యులు లేచి నిలబడ్డారు.
దీంతో స్టాలిన్ సహా సభ్యులు వాకౌట్ చేశారు. సిటీ బస్సులు వెళ్లలేని రోడ్లలో ప్రవేశపెట్టిన మినీ బస్సుల వల్ల రూ.158 కోట్ల ఆదాయం వచ్చిందని రవాణాశాఖ మంత్రి సెంథిల్ బాలాజీ చెప్పారు. ఒక్కో మినీ బస్సులో రోజుకు 775 మంది ప్రయాణిస్తున్నారని వివరించారు. దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోగా రేషన్ కార్డులను అందజేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కామరాజ్ చెప్పారు.