స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. తమిళనాడులోని నాగపట్నం తీరానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ సాయంత్రానికి చెన్నై- నాగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
అయితే వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే మత్య్యకారులు సముద్రంలో వేటకు వెళ్ల వద్దని సూచించింది. రాష్ట్రంలోని పలు పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. అయితే నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని కృష్ణ పట్నం ఓడరేవులో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.