బేలూరు ఆలయానికి ఉగ్ర బెదిరింపు
ఆలయం వద్ద భద్రత కట్టుదిట్టం
సాక్షి, బెంగళూరు: హాసన్ జిల్లాలోని ప్రఖ్యాత బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయానికి ఉగ్ర ముప్పు ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశంలోని ప్రముఖ, చారిత్రాత్మక ప్రాంతాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడనున్నారంటూ ఇటీవల నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఉగ్రవాదుల జాబితాలో బేలూరులోని పురాతన చెన్నకేశవ స్వామి ఆలయం కూడా ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో రాష్ట్ర హోం శాఖ అధికారులతో పాటు, ఆలయ అధికారులను సైతం అప్రమత్తం చేశాయి.
ఈ నేపథ్యంలో ఆలయం చుట్టూ అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ పూర్తి స్థాయిలో తనిఖీ చేసి అనంతరం ఆలయం లోనికి వెళ్లనిస్తున్నారు. ఆలయ ఆవరణలో దాదాపు 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు ఆలయంలోనికి వచ్చే ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా ఉంచారు. ఇక బేలూరుకు చేరుకునే అన్ని దారుల్లోనూ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసిన పోలీసులను విదేశీ, స్వదేశీ టూరిస్ట్‌ల వాహనాలన్నింటిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే బేలూరులోనికి అనుమతిస్తున్నారు.
2004లో సైతం ఆలయానికి బెదిరింపులు.....
ఇక బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయానికి 2004లో సైతం ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. ఆలయంలో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ రాసిన బెదిరింపు లేఖ ఆలయ కార్యనిర్వాహక అధికారికి అందింది. దీంతో అప్పట్లో ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఆలయానికి నలువైపులా మెటల్ డిటెక్టర్లను సైతం ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించారు. ఇలా దాదాపు రెండేళ్ల పాటు చెన్నకేశవ స్వామి ఆలయానికి పూర్తిగా భద్రతా వలయంలో రక్షణ కల్పించారు అధికారులు. అనంతరం మెటల్ డిటెక్టర్లను తొలగించి సాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, ప్రస్తుతం ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో మరోమారు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.