ఈ దారి నరకానికి నకలు!
- 20 ఏళ్లు దాటిన పట్టించుకునే వారు లేరు
- ఇబ్బందుల్లో రైతులు, గీతకార్మికులు, ప్రజలు
- గుంతల మయంగా మారిన పాకాల వాగు రోడ్డు
చెన్నారావుపేట: రెండు కిలోమీటర్ల దారి గుంతల మయంగా మారి రైతులకు, గీత కార్మికులు, ప్రయాణికులు, బాటసారులకు నరకాన్ని చూపిస్తున్నది. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు పూర్తిగా పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి వామ్మో ఈ దారి గుండా ప్రయాణం చేయలేమంటు బెంబేలత్తె విధంగా తయారైంది నర్సంపేట– నెకొండ ప్రధాన రహదారి నుండి మున్నేరు(పాకాల) వరకు ఉన్న రోడ్డు.. 20 సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్డు వేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దానిని ఎవరు పట్టించుకోలేదు.
ఈరోడ్డు కంకర తేలి గుంతల మయంగా మారడంతో ప్రయాణం చేయడానికి ప్రజలు జంకుతున్నారు. పాకాల వాగు పరిధిలో సుమారుగా 2 వేల ఎకరాలకు పైగా భూమి సాగు చేయబడుతుంది. వ్యవసాయం చేయడానికి రైతులు నిత్యం ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, ఎడ్ల బండ్లు వెలుతుంటాయి. అంతేకాకుండా ఖానాపురం, కొత్తురు, రంగాపురంతో పాటు పలు గ్రామాలకు ఈదారి గుండా ప్రజలు వెలుతుంటారు. వర్షాకాలంలో పూర్తిగా బురదమయంగా మారుతుంది. గుంతలు పెద్దగా ఉండటంతో నడవడానికే కష్టంగా ఉన్న దారిలో ఎరువులు, ధాన్యం తీసుకెళ్లడానికి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు వేయించాలని పలువురు కోరుతున్నారు.