ముచ్చటగా ముగ్గురు
సాక్షి, కరీంనగర్ : ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ మూడు నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. రామగుండం, వేములవాడ, కోరుట్ల నియోజకవర్గాల ఇన్చార్జీలను నియమిస్తున్నట్టు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ ప్రకటించింది. తెలంగాణ అంశంలో ద్వంద్వ వైఖరి అనుసరించడంతో జిల్లాలో కుదేలయిన పార్టీని పునర్నిర్మించేందుకు, ఎన్నికల నేపథ్యంలో క్యాడర్‌ను కాపాడుకునేందుకు సంస్థాగత వ్యవహారాలపై అధినేత చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగానే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. బలహీనంగా ఉన్నచోట్ల పార్టీని బలోపేతం చేయాలని, పనితీరు మెరుగుపర్చుకోకుం టే ఇన్చార్జీలను మార్చకతప్పదని హెచ్చరించారు.
గతనెలలో సంస్థాగత మార్పులు చేర్పులపై కసరత్తు చేపట్టారు. కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జీల మార్పుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో జిల్లా నాయకులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. నవంబర్ రెండవ వారంలో మూడురోజుల పాటు ఇన్చార్జీల నియామకాలపై జిల్లా నేతలతో భేటీ అయిన చంద్రబాబు స్థానిక నాయకత్వం అభ్యంతరాలతో నిర్ణయం తీసుకోలేకపోయారు. నవంబర్ 16న ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జిగా మద్దెల రవీందర్‌ను మాత్రమే ప్రకటించి మిగిలిన నియోజకవర్గాలపై నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా సోమవారం మూడు సెగ్మెంట్లకు కొత్త నేతలను ప్రకటించారు.
రామగుండం నియోజకవర్గ ఇన్చార్జిగా గోపు అయిలయ్యయాదవ్ స్థానంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డిని నియమించారు. వెనుకబడిన తరగతులకు చెందిన ఐలయ్యయాదవ్ను తొలగించడం పట్ల వ్యతిరేకత వస్తోంది. పెద్దిరెడ్డి హుస్నాబాద్ నుంచి అసెంబ్లీకి గానీ, కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గానీ పోటీ చేస్తారన్న ప్రచారం మొన్నటివరకు జరిగింది. రామగుండంలో కార్మిక నాయకుడిగా గుర్తింపు ఉన్న పెద్దిరెడ్డిని అక్కడ నుంచి బరిలోకి దింపితే కలిసొస్తుందన్న ఆశతో ఇక్కడ ఇన్చార్జి మార్పు జరిగినట్టు చెప్తున్నారు.
కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథంను అనారోగ్య కారణాల వల్ల మార్చారు. తన కుమారుడికే అవకాశం ఇవ్వాలని విశ్వనాథం కోరినప్పటికీ చంద్రబాబు సాంబారి ప్రభాకర్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అయితే గత రెండు ఎన్నికల్లో శికారి విశ్వనాథం ఓడిపోవడం వల్లే ఆయనను ఇన్చార్జి పదవి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.
వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జిగా గండ్ర నళిని తప్పించి మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావుకు పగ్గాలు అప్పగించారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిహెచ్.రమేశ్‌బాబు ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్థానంలో గండ్ర వెంకటేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. కొంతకాలానికే వెంకటేశ్వర్రావు మృతి చెందగా, ఆయన భార్య నళినిని ఇన్చార్జిగా నియమించారు. వేములవాడ బాధ్యతల నుంచి తనను తప్పించవద్దని గండ్ర నళిని కోరినా ఫలితం లేకపోయింది. చెన్నాడి సుధాకర్‌రావు పార్టీ మారేందుకు యోచిస్తున్నారని గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనను ఇన్చార్జిగా నియమించినట్టు భావిస్తున్నారు.
కరీంనగర్‌పై వీడని సందిగ్ధం
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపై ప్రతిష్టంభన వీడలేదు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీని వీడినప్పటినుంచి ఇక్కడ ఇన్చార్జి లేరు. స్థానిక నేతల్లో నుంచే ఇన్చార్జిని నియమించాలని, బయటి వారిని బలవంతంగా రుద్దవద్దన్న డిమాండ్ బలంగా ఉంది. వేములవాడ ఇన్చార్జిగా ఉన్న గండ్ర నళినికి కరీంనగర్ బాధ్యతలు ఇవ్వాలని భావించినా ఆమె సుముఖంగా లేకపోవడం, స్థానిక నేతల నుంచి వ్యతిరేకత కారణంగా నిర్ణయం తీసుకోలేకపోయారు.