పార్వేట కోలాహలం
కదిరి, న్యూస్‌లైన్ : భక్తుల కోలాహలం నడుమ బుధవారం మునిసిపల్ పరిధిలోని కుటాగుళ్లలో పులి పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏటా మకర సంక్రాంతి మరుసటి దినం కనుమ పండుగ రోజున ఈ పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. చెన్నరాయస్వామి ఒకప్పుడు ఆయుధం ధరించి వనవిహారార్థం వెళ్లేవారని, దృష్ట మృగాలను వేటాడి విజయ గర్వంతో తిరిగి వస్తారని, అందుకే పులి పార్వేట నిర్వహిస్తారని భక్తులు చెబుతుంటారు. ఇందులో భాగంగా కుటాగుళ్లలో ఉదయం చెన్నరాయ స్వామి ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం దేవరెద్దుతో పాటు అడవి నుండి పట్టుకొచ్చిన కుందేలును తప్పట్లు, మేళతాళాల మధ్య గ్రామంలో ఊరేగించారు.
తర్వాత ఊరంతా చెరువు కట్టవద్దకు చేరుకుని ఆచారం ప్రకారం కుందేలును జనం మధ్య వదిలారు. అది ప్రాణభయంతో పరుగులు తీసింది. అయినా సరే భక్తాదులు దాని వెంటపడి ప్రాణంతో వున్న కుందేలు శరీర భాగాలను తలా ఓ ముక్క లాక్కున్నారు. ఆ సమయంలో కాసేపు యువకుల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తుల మధ్య కూడా కొంత తొక్కిసలాట జరిగింది. గతంలో కుందేలు స్థానంలో పులిని వదిలే వారని, అయితే మనుషులకు హాని కల్గిస్తుందని కుందేలును వదులుతున్నట్లు పెద్దలు చెప్పారు.