నెలాఖరు లోగా పూర్తి చేయాలి
చేప పిల్లల సేకరణ టెండర్ల ప్రక్రియపై మంత్రి తలసాని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల సేకరణ టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. విధివిధానాల రూపకల్పనపై మంత్రి శుక్రవారం తన చాంబర్లో మత్స్యశాఖ అధికారులు, ఫెడరేషన్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి ప్రక్రియను తొలగించి జిల్లా స్థాయిలో టెండర్లు పిలిచినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన దరిమిలా గతంలో నిర్వహించిన టెండర్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో షార్ట్ నోటీస్ టెండర్ ప్రక్రియ విధివిధానాలపై మంత్రి సమీక్షించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఆరోగ్యవంతమైన చేప పిల్లల సరఫరాకు చేపట్టాల్సిన విధివిధానాలను చర్చించారు. సమావేశంలో మత్స్య శాఖ కమిషనర్ సంజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.