జిల్లాలో డెంగీ మరణాలు లేవు
ఏలూరు అర్బన్ : జిల్లాలో డెంగీ మరణాలు లేవని జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్. కె.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం yీ సీహెచ్ఎస్ శంకరరావు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గడచిన పది నెలల కాలంలో 800 మంది జ్వరపీడితులకు డెంగీ పరీక్షలు నిర్వహించగా వారిలో కేవలం 13 మందికి డెంగీ ఉందని నిర్ధారణ జరిగిందన్నారు. వారు కూడా చికిత్సల అనంతరం సాధారణ స్థితికి వచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయన డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చికిత్సల అనంతరం కోలుకుంటున్న జ్వరపీడితులను పరామర్శించారు. అనంతరం తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులకు, పుట్టుకతోనే కామెర్ల బారిన పడిన చిన్నారులకు నవజాత శిశు విభాగంలో అందుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఐవో డాక్టర్ మోహనకృష్ణ తదితరులు ఉన్నారు.