పాక్ సరిహద్దు దాటిన భారతీయ బాలుడు
అనుకోకుండా పాకిస్థాన్ భూబాగంలోని ప్రవేశించిన భారతీయ బాలుడు జితేంద్ర అర్జున్వార్ (15)ను నిన్న చీతా చౌక్ వద్ద పాక్ దళాలు అరెస్ట్ చేసినట్లు కోక్రపార్ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారని స్థానికపత్రిక డాన్ గురువారం తెలిపింది. అనంతరం అతడిని సింధ్ ప్రావెన్స్లోని హైదరాబాద్ నగరంలోని జువైనల్ కరాగారానికి పోలీసులు తరలించినట్లు పేర్కొంది. అతడు హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడని పోలీసులు తెలిపారని ఆ పత్రిక వివరించింది.
భారత్‌లోని మధ్యప్రదేశ్‌కు చెందిన ఐశ్వర్య అర్జున్వార్ కుమారుడైన జితేంద్ర అర్జున్వార్ రెండు నెలల క్రితం తన తల్లితో గొడవపడ్డాడు. దాంతో ఆగ్రహాం చెందిన అతడు ఇంట్లో నుంచి పారిపోయాడు. జితేంద్ర దేశంలోని వివిధ ప్రాంతాలలో అతడు సంచరించాడు. ఆ క్రమంలో భారత్ సరిహద్దును చేరుకుని అక్కడ స్వేచ్ఛగా తిరుగసాగాడు. అయితే ఆ సమయంలో అతడికి విపరీతమైన దాహాం వేసింది. తాగటానికి నీరు కోసం అతడు నిర్మానుష్యంగా ఉన్న భారత్ సరిహద్దు అంతా గాలించాడు. ఎక్కడ ఎవరు కనిపించలేదు.
కాగా పాక్ భూభాగంలో సైనిక దుస్తులు ధరించిన కొంత మంది వ్యక్తులు అతడికి కనిపించారు. దాంతో వారి వద్దకు వెళ్లి దాహంగా ఉంది మంచి నీరు కావాలని అడిగాడు. దీంతో వారు అతడి గుర్తింపు కార్డును అడిగారు. సైనికులకు జితేంద్ర జరిగిన విషయాన్ని వివరించాడు. దాంతో జితేంద్రను పాక్ సైనికులు ఉన్నతాధికారులకు అప్పగించారు. అతడిని జువైనల్ కరాగారానికి తరలించారు.