‘మిషన్’పై చిన్నచూపు!
జిల్లాలో నత్తనడకన సాగుతున్న ‘మిషన్ కాకతీయ’
చేవెళ్ల: చెరువులను పునరుద్ధరించి వర్షపు నీరు వృథాపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం జిల్లాల్లో ఇంకా కార్యరూపం దాల్చడంలేదు. పలు నియోజకవర్గాల్లోనూ పనుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా గుర్తించిన చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభించాల్సి ఉన్నా చేవెళ్ల సబ్ డివిజన్లో మాత్రం ప్రతిపాదనల దశలో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మే నెల చివరి వారంలో వర్షాకాలం ప్రారంభం కానున్నందున ఆ లోపే పనులను పూర్తిచేయడానికి యుద్ధపాతిపదికగా పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు ప్రతినిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నా కిందిస్థాయిలో ఆచరణ ఆరంభశూరత్వంగానే కనిపిస్తోంది.
నూతన సబ్ డివిజన్‌గా ఆవిర్భావం
ప్రతి నియోజకవర్గంలో ఒక చిన్న నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ తప్పనిసరిగా ఉండాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు చేవెళ్ల నూతనంగా ఏర్పాటైంది. చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, నవాబుపేట, శంకర్పల్లి మండలాలు ఈ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాలు హైదరాబాద్ ఇరిగేషన్ సబ్ డివిజన్ పరిధిలో, షాబాద్ మండలం పరిగి పరిధిలో, నవాబుపేట మండలం వికారాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఉండేవి.
ఇప్పటివరకు చెరువులు, కుంటల గురించి గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా పట్టించుకోకపోవడంతో నీటిపారుదలశాఖ సబ్ డివిజన్లు ఉన్నాయన్న సంగతి కూడా ప్రజలకు తెలియదంటే అతిశయోక్తికాదు. కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే వాటి గురించి తెలిసేవి. కాగా చేవెళ్లలో నీటిపారుదల శాఖ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సూచించినా.. తాత్కాలికంగా భవనం దొరకలేదనే సాకుతో ఇప్పటివరకూ ‘మిషన్ కాకతీయ’ పనులు ప్రారంభం కాలేదంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అవగతమవుతోంది.
526 పనుల గుర్తింపు
చేవెళ్ల ఇరిగేషన్ సబ్‌డివిజన్ పరిధిలో చెరువుల పునరుద్ధరణకు మొత్తం 526 పనులను గుర్తించారు.
వీటిలో ప్రధానంగా మైనర్ ఇరిగేషన్ కింద 171 పనులను గుర్తించారు. వీటిలో 20 శాతం అంటే కేవలం 37 పనులు మాత్రమే మొదటి విడతలో తీసుకునే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ 22 పనులకు మాత్రమే ఎస్టిమేషన్స్ చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇవి కాకుండా 300 చెక్‌డ్యాంలు, 41 పర్క్యులేషన్ ట్యాంకులు, 2 కుంటలకు పనులను అధికారులు గుర్తించారు. అవి ఇంకా మంజూరు కాలేదు.
పరిపాలనా అనుమతులు, అనంతరం టెండర్లు నిర్వహించి పనులను చేపట్టాల్సి ఉంటుంది. ఈ తతంగమంతా పూర్తికావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మే నెలాఖరులోగా పనులు ఏవిధంగా పూర్తవుతాయని ప్రజలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
పరిగి సబ్ డివిజన్లో...
చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నీటిపారుదలశాఖ సబ్ డివిజన్ పరిధిలో కాకతీయ మిషన్ కింద 605 పనులను గుర్తించారు. వీటిలో మొదటి విడతగా 123 పనులను ఎంపికచేశారు. కాగా కేవలం 13 పనులకు మాత్రమే టెండర్ల ప్రక్రియను అధికారులు ఇటీవలే పూర్తిచేశారు. ఈ పనులకుగాను ప్రభుత్వం రూ.3.55 కోట్లు మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని చేవెళ్ల, పరిగి నియోజకవరా్గాల్లో నత్తనడకను తలపిస్తోంది.
27 పనులకు ఎస్టిమేషన్లు పంపాం
నీటి పారుదల శాఖలో చేవెళ్ల సబ్ డివిజన్ ఈ ఏడాది కొత్తగా ఏర్పడింది. ఇప్పటికీ కార్యాలయానికి సరైన భవనమే దొరకలేదు. అన్వేషణలో ఉన్నాం. కాగా.. నీటిపారుదల శాఖ కింద 171 పనులను గుర్తించాం. వీటిలో 37 పనులు మొదటి విడతలో తీసుకుంటాం. ఇందులో 22 పనులకుగాను ఎస్టిమేషన్లు ప్రభుత్వానికి పం పించాం. పరిపాలనాపరమైన అనుమతులు (అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్) రాగానే టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేస్తాం. మే నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను పూర్తిచేస్తాం.
- విక్రం, ఇరిగేషన్ డీఈఈ, చేవెళ్ల సబ్‌డివిజన్