జలదిగ్బంధంలో చెవ్వాకుల పేట
ఆముదాలవలస : శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చెవ్వాకుల గ్రామం వద్ద వంశధార పొంగి పొర్లుతోంది. దాంతో చెవ్వాకుల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు వంశధార వరద ఉధృతి పెరగటంతో 54వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా హీరమండలం వద్ద గొట్టా బ్యారెజ్ అన్ని గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పై-లిన్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట దెబ్బతింది. 20వేల ఎకరాల్లో కొబ్బరి తోటలకు నష్టం వాటిల్లింది,
ఇక ఒడిశాలోని పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురియడంతో వంశధార నదికి వరద వచ్చే అవకాశం ఉందని భావిస్తూ కలెక్టర్ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మరో 10 వేల క్యూసెక్కుల నీరు అదనంగా చేరవచ్చని, దీనివల్ల వరద ప్రమాదం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వంశధార నదీతీర వాసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.