బాహుబలి జైలులో ఉండి గెలిచాడు
పట్నా: ఒకప్పుడు జేడీయూ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి పలు నేరారోపణల కారణంగా జైలుకు వెళ్లి ఆ పార్టీని వదిలేసిన అనంత సింగ్(బాహుబలి) అలియాస్ చోటే సర్కార్ తిరిగి మరోసారి తన సత్తా చాటాడు. ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనకుండా అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. జైలు ఉండే తన హవా చూపించాడు. తిరిగి అదే జేడీయూ పార్టీకి చెందిన అభ్యర్థిని మట్టకరిపించాడు. 2005, 2010లో జేడీయూ టికెట్ పై అనంత సింగ్ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఆ తర్వాత కొద్ది కాలానికే కిడ్నాప్, హత్యలు, అత్యాచారాల కేసులో జైలు పాలయ్యాడు. దీంతో అతడు పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడిని చాలా నెలలుగా జైలులోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో తిరిగి ఒకప్పుడు తాను బరిలోకి దిగిన మోకామా నంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఇదే స్థానంలో జేడీయూ తరుఫున బరిలో నిలిచిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్కు ఓటమి రుచి చూపించాడు. మొత్తం 18,348 ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనంత కుమార్ సింగ్ కు 54,005 ఓట్లు పోలవ్వగా.. జేడీయూ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 35,657 ఓట్లు లభించాయి.