మోదీ స్పీచ్ బ్యాన్... మమతపై విమర్శలు
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భారతీయ జనతా పార్టీ గుర్రుతో ఉంది. ఆదివారం కోల్‌కతాతోపాటు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపన్యాసం లైవ్ ప్రసారం చేసేందుకు యూజీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అన్నికళాశాలలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న విద్యాలయాల్లో మాత్రం ప్రసారం చేయొద్దంటూ మమతా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాషాయం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపికైన ఒక ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ ప్రసంగం అడ్డుకోవటం దారుణం. ప్రధాని సందేశాలను విద్యార్థులు వినకోవద్దనుకోవటం సరైన పద్ధతి కాదు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి పేర్కొన్నారు.
ఇక దీదీ(మమతా) మరీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుదేశ్ వర్మ మండిపడ్డారు. స్వామి వివేకానందుడు దేశభక్తుడు. ఆయనపై ఉపన్యాసం విషయంలో విద్యాలయాలకు, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లాంటి అత్యున్నత విభాగం ఇచ్చిన ఆదేశాలను అడ్డుకోవటం ద్వారా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆమె వ్యవహరిస్తున్నారు అని సుదేశ్ చెబుతున్నారు.
కాగా, 1893 సెప్టెంబర్ 11, చికాగో వేదికగా ప్రపంచ సర్వమత సమ్మేళన సదస్సులో స్వామి వివేకానందుడు ఉపన్యసించిన విషయం తెలిసిందే. ఆ అపూర్వ ఘట్టానికి 125 ఏళ్లు పూర్తి కావటంతో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.