the Chief Minister Chandrababu
-
అటు తిరిగి.. ఇటు తిరిగి.. మళ్లీ అమరావతి
తాత్కాలిక రాజధానిగా నిర్ణయం? సాక్షిప్రతినిధి, గుంటూరు : అమరావతి....తాత్కాలిక రాజధాని కాబోతోందని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరును ఖరారు చేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకముందు తాత్కాలిక రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. మంగళగిరికి సమీపంలోని అమరావతి టౌన్షిప్లో అని, ఆ తరువాత ఒక ప్రైవేట్ కంపెనీ భూమి తీసుకుంటామని రాష్ట్ర మంత్రి పి.నారాయణ ప్రకటించారు. తాజాగా మంగళవారం తాత్కాలిక రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసు కోనుందని సమాచారం. రాజధాని పనుల పర్యవేక్షణకు అవకాశం... రాజధాని నిర్దేశిత ప్రాంతమైన తుళ్లూరు మండలం అమరావతికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక, ఆధ్మాత్మికంగా ప్రత్యేక గుర్తింపు కలిగిఉంది. ప్రస్తుతం అమరావతిని భౌగోళికంగా పరిశీలిస్తే రాష్ట్రానికి తూర్పుదిశలోఉంది. ఉత్తర దిక్కున కృష్ణానది ప్రవహిస్తుంది. దీని వల్ల రాజధానికి తాగునీటి సమస్య ఉండదని భావిస్తున్నారు. నూతన రాజధాని పనుల అభివృద్ధిని ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండి సమీక్షించుకునే వీలుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు పట్టణాలకు అమరావతి సమీపంలో ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరంలో విజయవాడ, గుంటూరు నగరాలు ఉన్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రముఖులకు అసౌకర్యం కలిగే అవకాశం లేదు. ప్రపంచంలో బౌద్ధమతం భాగా అభివృద్ధి చెందిన 34 దేశాల నుంచి రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సహకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక్కడి ప్రభుత్వ భూములను పరిశీలిస్తే వ్యవసాయశాఖ అధ్వర్యంలో స్టేట్‌సీడ్ ఫారమ్ కింద సుమారు 120 ఎకరాలు, దానికి సమీపంలోనే దేవాదాయశాఖకు చెందిన సుమారు 200 ఎకరాల భూమి ఉంది. దీనికి ఐదు కిలోమీటర్ల దూరంలో పెద మద్దూరు కొండ నుంచి కర్లపూడి వరకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో అటవీభూములు వేలాది ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. ఇది మరో వ్యూహమా... ? తొలి నుంచి రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదు. మొదట్లో నూజివీడు పరిసర ప్రాంతాల్లో రాజధాని వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు వినపడటంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా భూములు కొనుగోలు చేశారు. నామమాత్రపు ధర కలిగిన భూములు లక్షలు పలికాయి. కోట్లు వెదజల్లి కొనుగోలు చేశారు. ఆ తరువాత విజయవాడ-గుంటూరు మధ్య అంటూ ఊహాగానాలు రావడంతో ఆ రెండు నగరాల్లోని భూములకు డిమాండ్ ఏర్పడింది. ఎకరా రూ.10 కోట్లకు కూడా కొనుగోలు చేశారు. చివరకు తుళ్లూరులోనే శాశ్వత రాజధాని అని ప్రకటించారు. దీంతో మొదటి రెండు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. తాత్కాలిక రాజధాని విషయంలోనూ ఇదే తరహా విధానాన్ని ప్రభుత్వం అనుసరించింది. మంగళగిరికి సమీపంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు మొదట ప్రకటించండంతో ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు. చివరక అందరి అంచనాలకు భిన్నంగా అమరావతిని తాత్కాలిక రాజధానిగా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడటంతో అక్కడి భూములకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ తరహా ప్రకటనల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని, వారు భూములు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే రాజధాని, తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. -
బీసీలపై చిన్నచూపు
కర్నూలు(అర్బన్): ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీసీలను పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బీసీల ఆర్థిక చేయూతకు మంగళం పాడింది. ఈ క్రమంలోనే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంతవరకు బీసీ కార్పొరేషన్లకు నయాపైసా విదల్చ లేదు సరికదా, కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ఏడాదిన్నర కాలంగా బీసీలు ఎదురుచూస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1627 మంది జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చినా వారికి ఇంతవరకు సబ్సిడీ విడుదల కాకపోవడం గమనార్హం. ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు మార్గదర్శకాలను విడుదలచేసిన ప్రభుత్వం బీసీ రుణాలపై ఎలాంటి మార్గదర్శకాలు వెల్లడించలేదు. దీనిపై బీసీ వర్గాలు ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది విడుదల కాని సబ్సిడీ రూ.826.918 లక్షలు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల వారికి మార్జిన్ మనీ పథకం కింద 3968 మందికి 1085.30 లక్షలు, మున్సిపల్ ప్రాంతాల వారికి రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద 893 మందికి రూ.243.45 లక్షలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించి దరఖాస్తులను స్వీకరించారు. వీరిలో 1834 మంది గ్రామీణ ప్రాంతాల వారికి రూ.655.458 లక్షలు, 359 మంది మున్సిపల్ ప్రాంతాల వారికి రూ.171.450 లక్షలు సబ్సిడీ విడుదల చేసేందుకు ప్రొసీడింగ్స్‌ను అందించారు. ప్రొసీడింగ్స్ అందుకున్న వారిలో 1402 మంది గ్రామీణ ప్రాంతాల వారు, 225 మంది మున్సిపల్ ప్రాంతాల వారు జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతా నెంబర్లను అప్పట్లోనే అందించారు. అయితే వారికి నేటి వరకు నయాపైసా సబ్సిడీ విడుదల కాలేదు. పేరు మారినా ఫలితం సున్నా.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ అభ్యుదయ యోజన పథకం పేరులో రాజీవ్‌ను తీసివేసి బీసీ అభ్యుదయ యోజనగా మార్చినా, బీసీ కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ఈ పథకం కింద 1211 మంది బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు 50 శాతం సబ్సిడీతో 3.3250 కోట్లు, 8193 మంది గ్రామీణ ప్రాంతాల వారికి రూ.22. 5036 కోట్లు సబ్సిడీ అందించేందుకు వార్షిక ప్రణాళికలు రూపొందించారు. ఇంతవరకు మార్గదర్శకాలు మాత్రం విడుదల చేయకపోవడం బీసీ వర్గాలను కలచివేస్తోంది. రుణం కోసం ఏడాదిగా తిరుగుత్నా టైలరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం గత ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకు రుణం అందలేదు. ఇప్పటికైనా రుణాలను విడుదల చేస్తే నాలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుంది. - టీ.శేఖర్, చిత్తారివీధి, కర్నూలు కొత్త రుణాలు ఎప్పుడు ఇస్తారో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలపై నేటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అసలు ఈ ఏడాది రుణాలు ఇస్తారో, లేదో ప్రభుత్వం తెలియజేయూలి. రుణాలు ఇస్తే పేదలకు సాపడినట్లవుతుంది. - ఈ.విజయ్‌గౌడ్, కుమ్మరవీధి, కర్నూలు -
నమ్మించి.. వంచించి!
బాబు పాలనకు వంద రోజులు ఎన్నికల ముందు నుంచే ఎన్నెన్నో హామీలు. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అధికారంలోకి రావడమే ధ్యేయంగా నమ్మ బలికారు. అరచేతిలో వైకుంఠం చూపి ఎట్టకేలకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. ఇలా వంద రోజులు గడిచిపోయాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్పిస్తే.. చేతల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారు. ప్రభుత్వ తీరు చూస్తే అవన్నీ కార్యరూపం దాలుస్తాయో లేదోననే సందిగ్ధం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ ప్రభుత్వ వంద రోజుల పాలనలో జిల్లా ప్రజలకు ఒరిగింది శూన్యం. స్వాతంత్య్ర దినోత్సవం సాక్షిగా వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అందుకు అనుగుణంగా నిధుల విడుదలలో విఫలమయ్యారు. రైతులు.. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టినా ఇప్పుడు వెనుకంజ వేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. రోజుకో నిబంధనను తెరపైకి తీసుకొస్తూ.. మెలికలు పెడుతుండటం మొదటికే మోసం తీసుకొస్తారేమోననే భావన కలిగిస్తోంది. మొదటి సంతకంతో మాయ చేసి.. కమిటీ పేరిట కాలయాపన చేసి.. రీషెడ్యూల్ పేరిట ఊరించి.. తాజాగా ఆధార్, రేషన్ కార్డులకు లింకు పెట్టడం రుణ మాఫీ అమలుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక డ్వాక్రా రుణాల మాఫీ లేదని తేలిపోయింది. రివాల్వింగ్ ఫండ్‌తో సరిపెట్టడం మహిళల ఆగ్రహానికి కారణమవుతోంది. జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకలు.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీలను టీడీపీ సర్కారు అటకెక్కిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం.. ఉర్దూ విశ్వవిద్యాలయం మాటే మరిచారు. అసంపూర్తి రిజర్వాయర్లను పూర్తి చేస్తామని ప్రకటించినా.. బడ్జెట్లో కేటాయించిన అరకొర నిధులు మరమ్మతులకు కూడా సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని విషయంలోనూ జిల్లాకు అన్యాయం జరిగింది. ఉద్యమాలు చేసినా.. దీక్ష బూనినా.. గొంతెత్తి నినదించినా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. లక్షలాది మంది సీమ ప్రజల ఆత్మఘోషను కాదని.. కార్పొరేటర్లకు తొత్తుగా వ్యవహరించారు. విజయవాడ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి సీమ అభివృద్ధి అవకాశాలను చేజేతులా కాలరాశారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ నేతలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు బి.సి.జనార్దన్‌రెడ్డి, బి.వి.జయనాగేశ్వరరెడ్డిలు సైతం రాజధాని విషయంలో నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల్లో అభద్రత టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక పాలనలో స్తబ్దత నెలకొంది. అభివృద్ధిలో కీలకమైన అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. చెప్పినట్లు నడుచుకోవాలని తెలుగుతమ్ముళ్లు హుకం జారీ చేస్తుండటం.. లేదంటే బదిలీలకు సిద్ధమవ్వాలని హెచ్చరించడం పరిపాటిగా మారింది. సెలవు రోజుల్లోనూ మంత్రి, ఎమ్మెల్యేలు తమ ఇళ్లకు పిలిపించుకుని ఆదేశాలు జారీ చేస్తుండటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కంటి మీద కునుకు కరువైంది. మైనింగ్, ఇసుక అక్రమ రవాణా: ప్రకృతి వనరులను దోచుకునేందుకు కొందరు టీడీపీ నేతలు సన్నద్ధమయ్యారు. మైనింగ్, ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. లీజుదారులపైనా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయితీ తమకే ముట్టజెప్పాలని దౌర్జన్యం చేస్తున్నారు. రేషన్ డీలర్లు.. ఫీల్డ్ అసిస్టెంట్లు.. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. వంద రోజులు గడిచిపోయినా ప్రజలను మభ్యపెట్టడం మినహా ఏమీ చేయలేకపోవడం టీడీపీ ప్రభుత్వ నైజాన్ని తెలియజేస్తోంది.