అన్నీ చేస్తా.. ఇప్పుడే కాదు
* హామీలు నెరువేరుస్తానంటూనే ఇబ్బందులున్నాని చెప్పిన సీఎం
* రుణమాఫీపై నిలదీసిన ప్రజలు
* ఆదాయం పెంచేందుకు అధికారుల నుంచి సూచనల స్వీకరణ
* జిల్లాలో ముగిసిన చంద్రబాబు రెండు రోజుల పర్యటన
సాక్షి, ఏలూరు : ‘ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నా. రాష్ట్ర విభజన జరగటంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు అప్పులు మిగి లాయి. వనరులు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని అన్నీ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తా. దానికి మీరందరూ సహకరించాలి’ అని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం జిల్లా అధికారులతో జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగాభవాని కల్యాణ మండపంలో సమీక్ష జరిపారు.
ఆర్థిక వనరుల పెంపుదలకు అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. పర్యాటక పరంగా అభివృద్ధి చేయడంతోపాటు గోదావరిలో ఇసుక మేటలు తొలగించడం, వరి విత్తనాలు జిల్లాలోనే తయారు చేసుకోవడం, బీచ్‌ల అభివృద్ధి, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు అవలంభించడం వంటి అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం సమీక్ష ముగించారు. తరువాత అనారోగ్యానికి గురైన చింతలపూడి నియోజకర్గ టీడీపీ కన్వీనర్ మండవ లక్ష్మణరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఇటీవల మరణించిన ఏఎంసీ మాజీ చైర్మన్ నందిన హరిశ్చంద్ర నివాసానికి వెళ్లి అతని కుమారుడు సతీష్‌ను ఓదార్చారు. నరసన్నపాలెం నుంచి రోడ్ షో ప్రారంభించిన చంద్రబాబు అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గిరిజన హక్కుల్ని కాపాడటంతోపాటు గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యపై రైతులు వివరించడంతో ఆ శాఖ ఎస్ఈని పిలిచి పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ప్రతి ఫీడర్ వద్ద మీటర్లు పెట్టి ఏ ఫీడర్లో ఎంత విద్యుత్ వినియోగం జరిగిందో తానెక్కడుంటే అక్కడ తెలిసే ఏర్పాటు చేస్తున్నానని వివరించారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కావాలనే కొందరు రాజకీయం చేశారని అయినప్పటికీ దానిని పూర్తి చేసేందుకు.. ముంపు మండలాలపై ఆర్డినెన్స్ తీసుకువచ్చేలా కృషి చేశామని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా రాష్ట్ర విభజన చేయడం వల్ల అప్పులే మిగిలాయని, కనీసం ఇంటికో రుణమైనా మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. దీనిపై ఆర్బీఐతో మాట్లాడుతున్నానన్నారు. దేశంలోనే అత్యున్నత రాజధానిని నిర్మిస్తానని చెప్పారు. ఈ సమయంలో ఓ రైతు కల్పించుకుని ‘రాజధాని సంగతి తర్వాత, ముందు రైతులను పట్టించుకోండి, పంటకు గిట్టుబాటు ధర రావడం లేద’నడంతో ప్రత్యేక నిధి సమకూర్చి ధరలను క్రమబద్దీకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సీతంపేట, బయ్యనగూడెంలో మహిళలు డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చేస్తానని, కొంత సమయం ఇవ్వాలని చెప్పిన చంద్రబాబు ముందుకు సాగారు. బయ్యనగూడెం సెంటర్లో మాట్లాడుతూ సెల్‌ఫోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలని సూచించారు. రౌడీలుంటే తోకలు కట్ చేస్తానని, వారికి రాష్ర్టంలో ఉండే హక్కులేదని చంద్రబాబు హెచ్చరించారు. అక్కడి నుంచి పొగాకు బోర్డు కార్యాలయూనికి చేరుకుని పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ర్టంలోనే నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేసే జిల్లా ఇదేనని అన్నారు. సాయంత్రం 4 గంటలకు కనకాద్రిపురం (ఆరిపాటి దిబ్బల) గ్రామంలో డ్వాక్రా మహిళలతో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. డ్వాక్రా రుణమాఫీ కచ్చితంగా చేసితీరుతానన్నారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్లో కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు.
వెల్డన్ సుజాత మంత్రి పీతలకు సీఎం ప్రశంస
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘వెల్డన్ సుజాత. జిల్లా టూర్ బాగానే జరిగింది. అందరూ..పాజిటివ్ మైండ్స్‌తో ఉన్నారు. జిల్లాకు మంచి చేద్దాం. ఇక్కడ వనరులను మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ దిశగా దృష్టి కేంద్రీకరించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గనులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాతను అభినందిస్తూ సూచనలు చేశారు. సీఎం రెండురోజుల పర్యటన మొత్తం దాదాపుగా మంత్రి సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గం, సమీప గ్రామాల్లోనే సాగింది.
తొలిరోజు బుధవారం గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనం అనంతరం చంద్రబాబు చింతలపూడి పరిధిలోని తాడిచర్ల, కామవరపుకోట, ఉప్పలపాడు, రావికంపాడు, దేవులపల్లి, గుర్వాయిగూడెం, జంగారెడ్డిగూడెంలో పర్యటించి రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఇక్కడెక్కడా రైతులు, మహిళలతో ఇబ్బంది లేకుండా సుజాత జాగ్రత్తలు తీసుకున్నారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోకి వెళ్లిన చంద్రబాబుకు ప్రజల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించినప్పటికీ జిల్లాలో తన రెండురోజుల భారీ షెడ్యూల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగడంతో ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.