The Chief Minister K Chandrasekhar Rao
-
రేపు సీఎం రాక కేసీఆర్
కాకతీయ ఉత్సవాలపై స్పష్టత వచ్చేనా...‘గ్రేటర్ వరంగల్’ ఆశ నెరవేర్చేనా... టెక్స్టైల్ పార్క్’కు భూ లభ్యత ఫైనల్ అయ్యేనా... పారిశ్రామిక కారిడార్‌కు ముందడుగు పడేనా... రైల్వే వ్యాగన్’ భూ సమస్య కొలిక్కి వచ్చేనా... కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మౌనం వీడేనా... వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోసారి జిల్లాకు వస్తున్నారు. అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులపై సమీక్ష కోసం సోమవారం ఆయన జిల్లాకు రాను న్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే కేసీఆర్ జిల్లాకు వస్తుండడం ఇది మూడోసారి. ప్రజాకవి కాళోజీ జయంతి ఉత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 9, కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం సందర్భంగా ఈ నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వచ్చారు. రెండుసార్లు ప్రత్యేక కార్యక్రమాల కోసం వచ్చి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షించలేకపోయూరు. ఈ క్రమంలో అభివృద్ధిపై సమీక్ష కోసమే ప్రత్యేకంగా సోమవారం జిల్లాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... తాజా పర్యటనపై జిల్లా ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి. ప్రధానంగా పారిశ్రామిక కారిడార్, కాకతీయ ఉత్సవాలు, వరంగల్ నగర అభివృద్ధి ప్రణాళికలపై సీఎం ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక కారిడార్... తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి అంతా వరంగల్ కేంద్రంగానే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్-వరంగల్-భూపాలపల్లి ప్రాంతాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ప్రతిపాదన దశలో ఉంది. హైదరాబాద్-వరంగల్ నగరాల మధ్య పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి నది నుంచి నీటిని, సింగరేణి బొగ్గును వనరులుగా వినియోగించుకోవచ్చని పేర్కొంటోంది. కరెంట్ ఉత్పత్తికి సంబంధించి సింగరేణి కొత్తగా చేపట్టనున్న గనులు జిల్లాలోనే ఉన్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇలా అన్ని వనరులతో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా 31,334 ఎకరాల భూములు ఉన్నాయని జిల్లా యంత్రాంగం ఆగస్టులోనే నిర్ధారించింది. జిల్లాలో ప్రస్తుతం ఒక్క భారీ పరిశ్రమ లేదు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో ఈ వెలితి తీరుతుందని జిల్లా ప్రజలు కోటి ఆశతో ఉన్నారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు అవసరమైన 500 ఎకరాల లభ్యతను సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేలో గుర్తించే అవకాశం ఉంది. టెక్స్టైల్ పార్క్ అధ్యయనం కోసం ఎంపీ, ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని స్వయంగా ఆయన ఆదేశించారు. దీంతో ఈ పరిశ్రమ ఏర్పాటుపై జిల్లా ప్రజల్లో ధీమా పెరుగుతోంది. భూపాలపల్లి ప్రాంతంలోనే కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బయ్యారంలో కాకుండా మహబూబాబాద్ పరిసరాల్లో లేదా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న మణుగూరు-రామగుండం రైల్వే లేను ఏర్పాటు అయితే బొగ్గు ఆధారిత పరిశ్రమలు మరికొన్ని జిల్లాలో కొలువుదీరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదన ఉంది. దీనిపై స్పష్టత రావడంలేదు. ఐదేళ్ల క్రితం మంజూరైన రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు అవసరమైన భూమిని అప్పగించే విషయంలో ఆలస్యమవుతుండడంతో ఈ ప్రాజెక్టు వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో చేపట్టిన కేసీఆర్ పర్యటనలో భూ సేకరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాకతీయ ఉత్సవాలు... వచ్చే ఏడాది జనవరి 9, 10, 11 తేదీల్లో కాకతీయ ఉత్సవాలను జాతీయస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాకతీయ పాలకురాలు రుద్రమాదేవి పట్టాభిషిక్తురాలై 800 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి 2014 డిసెంబర్ వరకు నిర్వహించిన కాకతీయ ఉత్సవాలను నిర్వహించింది. ఇవి తూతుమంత్రంగానే జరిగాయి. ఉత్సవాల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలు మాత్రమే కాస్త చెప్పుకునే విధంగా నిర్వహించారు. సమైక్య రాష్ట్రంలో నిధుల కొరత కారణంగా కాకతీయ ఉత్సవాలు వెలవెలబోయాయని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఉద్యమనేతగా కె.చంద్రశేఖరరావు పలుమార్లు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కాకతీయ ఉత్సవాలు నిర్వహణపై స్పష్టత ఇస్తారో వేచి చూడాల్సిందే. వరంగల్... గ్రేటరయ్యేనా ! హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే జిల్లా అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశం సందర్భంగా వరంగల్ నగరం అభివృద్ధికి కచ్చితమైన ప్రణాళికలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నగర జనాభా 10 లక్షలకు చేరుకున్నా... ఇప్పటికీ మౌలిక వసతుల విషయంలో దయనీయంగా ఉంది. వరంగల్ నగరపాలక సంస్థను గ్రేటర్ వరంగల్‌గా మార్చాలనే డిమాండ్ ఐదేళ్లుగా పెరుగుతోంది. వరంగల్‌కు గ్రేటర్ హోదా కల్పిస్తే కీలక ప్రాజెక్టులకు వరంగల్ నగరం అర్హత పొందుతుంది. తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ, వీధి దీపాలు, రవాణా వ్యవస్థ, ఆర్థిక స్థితిగతులు, కంప్యూటరీకరణ, మౌళిక వసతుల కల్పన వంటి అంశాలకు అనేక రకాలు నిధులు వచ్చే ఆస్కారం ఉంది. 2010 నుంచి గ్రేటర్ అంశం తెరపైకి వచ్చింది. గత పాలక వర్గాలు గ్రేటర్ కోసం తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాయి. 2012 మార్చిలో నగర శివారులోని 42 గ్రామ పంచాయతీలను రద్దు చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవే గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక ప్రకటించింది. గ్రేటర్ హోదాకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నా... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంలేదు. గ్రామాల విలీనం, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అడ్డంకులతో వరంగల్ నగరపాలక సంస్థకు ఇటీవల ఎన్నికలు సైతం జరగలేదు. పాలకవర్గం లేక అభివృద్ధి కుంటుపడింది. సీఎం పర్యటన షెడ్యూల్ ఉదయం 10.50 గం. : హైదరాబాద్‌లో తన నివాసం నుంచి బయలుదేరుతారు.. 11.00 : బేగంపేట ఎరుుర్‌పోర్టుకు చేరుకుంటారు.. 11.05 : హెలికాప్టర్లో బయలుదేరుతారు.. 11.30 : హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో దిగుతారు. ప్రతిపాదిత రింగురోడ్డు, సమీప ప్రాంతాలనే ఏరియల్ సర్వే చేస్తారు.. 12.00 : కలెక్టరేట్లో సమీక్ష సమావేశం.. 2.00 : ‘కెప్టెన్’ ఇంట్లో మధ్యాహ్న భోజనం.. 3.00 : కెప్టెన్ ఇంటి నుంచి బయలుదేరుతారు.. 3.10 : చింతగట్టు, జయగిరి సమీపంలోని టెక్స్టైల్ పార్కు ప్రతిపాదిత స్థలం సందర్శన.. 3.30 : అక్కడి నుంచి రిటర్న్.. 4.00 : ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు.. 4.05 : హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు పయనం. -
మా‘నీటి’ పథకం
నేడు ఎల్ఎండీకి కేసీఆర్ రాక మంత్రులు, అధికార యంత్రాంగం సైతం ఉదయం 11.30 గంటలకు సీఎం చేరిక సిద్దిపేట నీటి సరఫరా పథకం పరిశీలన కాన్వాయ్ ద్వారా హన్మాజీపల్లె సంపు సందర్శన గంటకుపైగా ఇంటేక్వెల్, పంపుసెట్ పరిశీలన ఏర్పాట్లు సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం బెజ్జంకి/తిమ్మాపూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం జిల్లాకు వస్తున్నారు. ఆయనతోపాటు రాష్ర్ట మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు సుమారు రెండు వందల మంది గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులు రానున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అందుకు స్ఫూర్తిగా నిలిచిన దిగువ మానేరు డ్యాం (ఎల్ఎండీ)- సిద్దిపేట నీటి సరఫరా పథకం అమలు తీరును మంత్రులు, అధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు. ఈ పథకాన్ని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1998లో రూ.60 కోట్లతో నిర్మించారు. పర్యటనలో అందులో భాగంగా ఉదయం 11 గంటలకు సీఎం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11.45 గంటలకు లోయర్ మానేరు డ్యాం వద్దకు చేరుకుంటారు. అప్పటికే రాష్ట్ర మంత్రులు, అధికారులు రోడ్డు మార్గాన అక్కడికి విచ్చేస్తారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి బెజ్జంకి మండలంలోని మైలారం గుట్ట, హన్మాజీపల్లె సమీపంలోని ఇంటేక్వెల్ పంపుహౌస్‌లను సందర్శిస్తారు. సుమారు గంటకుపైగా అక్కడే ఉంటారు. ఈ పంపుహౌస్ ద్వారా గత పద్నాగేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గంలోని 180 గ్రామాలకు విజయవంతంగా నీటిని సరఫరా చేస్తున్న తీరును పరిశీలించడంతోపాటు మంత్రులు, అధికారులకు వివరిస్తారు. విస్తృత ఏర్పాట్లు.. సీఎం రాక నేపథ్యంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఎస్పీ వి.శివకుమార్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులంతా మంగళవారం హన్మాజీపల్లెకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆర్డబ్యూఎస్ ఎస్ఈ హరిబాబు, ఈఈ ప్రకాశ్, ఆర్అండ్బీ ఎస్ఈ చంద్‌లాల్, డీఈ వెంకటరమణ, జేఈ నరేందర్‌లను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎల్ఎండీకి విచ్చేసి స్థానిక ఎస్సారెస్పీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వైద్యుల బృందాన్ని, 104, 108 వాహనాలను, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, బారికేడ్లు, ఇతర సదుపాయాలకు సంబంధించి ఒక్కో అధికారికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. టెంట్లు, కుర్చీలు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ, జెడ్పీ సీఈవో, 24 గంటల విద్యుత్ సరఫరాను ట్రాన్స్‌కో ఏస్ఈ, పరిశుభ్రతను డీపీవో, భద్రతను ఎస్పీ చూసుకోవాలన్నారు. సీఎం పర్యటన ప్రాంతంలో అంబులెన్స్, 104, 108 వాహనాలు, మెడికల్ టీంని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇన్చార్జి అడిషనల్ జేసీ టి.వీరబ్రహ్మయ్య, జెడ్పీ సీఈవో అంబయ్య, డీఎస్వో చంద్రప్రకాష్, ఆర్డీవో చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శోభ, డీపీవో కుమారస్వామి, టూరిజం అధికారి వెంకటేశ్వర్రావు, ఎల్ఎండీ ఈఈ కరుణాకర్, క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ జువేరియా, ఏవో రాజగౌడ్, తహశీల్దార్లు కోమల్‌రెడ్డి, శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్‌స్వామి ఉన్నారు.