యోగి ముందుకు గోరఖ్‌పూర్ నివేదిక
లక్నో: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల ఘటనకు సంబంధించి కీలక నివేదిక ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ మంగళవారం సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు రిపోర్ట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో బీఆర్డీ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌తోపాటు 5 గురు సిబ్బందిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని యోగి ఆదేశించారు.
చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని హెల్త్ సెక్రటరీ అలోక్ కుమార్, ఆర్థిక కార్యదర్శి ముకేష్ మిట్టల్, సంజయ్ గాంధీ ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ హేమ చంద్ర కమిటీ ఘటనపై విచారణ చేపట్టింది. జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ రౌతెలా రిపోర్ట్‌తోపాటు తాము అధ్యయనం చేసిన వివరాలను సీఎంకు సమర్పించిన నివేదికలో పొందుపరిచింది. ఆక్సిజన్ కొరత విషయం తెలిసి కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బకాయిల వ్యవహారం ప్రిన్సిపాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లలేదని రెండు కమిటీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.
గోరఖ్ పూర్ లోని బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆగష్టు 10 నుంచి 11 మధ్య 36 మంది పిల్లలు ఆక్సిజన్ కొరతతో మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో మిగతా పిల్లల మరణాల గురించి కూడా ప్రస్తావించిన కమిటీ, మెరుగైన సదుపాయాలు కల్పించాలంటూ ప్రభుత్వానికి సిఫార్సులు కూడా చేసినట్లు తెలుస్తోంది.