అంతా గోప్యం!
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆ శాఖాధికారులతో గుట్టుగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. లోపాలు బయటపడతాయనో మరే కారణమో తెలియదు గానీ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. లోపలికి వెళ్లిన ఒకరిద్దరు మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించేశారు. సుమారు రెండుగంటల పాటు పునేఠా వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించారు.
డొల్లతనం బయటపడుతుందనే...
వ్యవసాయాధికారుల డొల్లతనం బయటపడుతుందనే మీడియాను లోపలికి అనుమతించలేదనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. పాత్రికేయులు సమావేశంలో ఉంటే లోపాలను ఎత్తిచూపుతారని, బండారం బయటపడుతుందనే భావనతో లోపలికి అనుమతించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అదే విధంగా పంట నష్టం అంచనా వేయడంలోనూ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. రాజకీయ సిఫారసులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పొలంబడి, వర్మీకంపోస్టు యూనిట్ వంటి పథకాలు తీరు ఆధ్వానంగా ఉంది. దీనికి తోడు వీటన్నింటి గురించి అధికారులను ప్రశ్నిస్తే పత్రికలు, మీడియాలో వస్తుం దని ఆందోళనతో ఈ సమీక్షను మీడియా ప్రతి నిధులకు ప్రవేశం నిరాకరించినట్టు తెలిసింది.
అధికారులపై ఆగ్రహం
పథకాల నిర్వహణ, ఇతర విషయాల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై పునేఠా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మ పథకం ద్వారా గత ఏడాది ఏయే కార్యక్రమలు నిర్వహించారని ఆత్మ పీడీ రాజబాబుని ముఖ్యకార్యదర్శి పునేఠా ప్రశ్నించారని, దీనికి సరైనా ఆయన సమధానం చెప్పలేనట్టు తెలిసింది. అదేవిధంగా రైతు శిక్షణ కేంద్రం ద్వారా గత ఏడాది ఎంత మందికి శిక్షణ ఇచ్చారని , ఏయే అంశాలపై శిక్షణ ఇచ్చారని డీడీ ఆశాదేవిని ప్రశ్నించగా ఆమె కూడా సరైన సమాధానం చెప్పలేకపోయినట్టు తెలిసింది. దీంతో వీరిద్దరిపై పునేఠా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిర్లక్ష్యంగా పనిచేస్తే సహించేదిలేదని, వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయాలని, మొక్కుబడిగా పనిచేయాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. మొక్కుబడి పర్యటనలను మాని రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి, వ్యవసాయశాఖ అనగానే రైతులకు అండగా ఉంటుందనే భావనను తీసుకురావాలని చెప్పారు.