టీఆర్ఎస్కు పట్టం కట్టండి
నల్లగొండను సస్యశ్యామలం చేస్తాం
ఫ్లోరైడ్ సమస్యను ఎందుకు విస్మరించారు
బీబీనగర్ నిమ్స్‌ను ఎందుకు పూర్తి చే యలేదు
జిల్లా మంత్రులవి అసమర్థుల జీవితయాత్రలు
టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక చొరవ
జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు
ఫ్లోరైడ్ పీడ విరుగుడుకు రూ. 600కోట్ల నుంచి రూ.700 కోట్లు ఖర్చు పెడతాం
నల్లగొండ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
సాక్షిప్రతినిధి, నల్లగొండ, ‘నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. జిల్లాలో ఒక్కో నియోజకర్గంలో లక్ష ఎకరాల చొప్పున 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. అవసరమైతే రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లైనా ఖర్చు చేస్తాం’ అని టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులందరి కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ జిల్లాకు కొన్ని హామీలు ఇచ్చారు.
టీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించండి. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పునర్నిర్మాణం సక్రమంగా జరుగుతుంది. సీమాంధ్ర పాలకుల హయాంలో పూర్తికాని ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు శ్రద్ధ తీసుకుంటామని కేసీఆర్ అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నలభై ఏళ్లుగా ఎందుకు పెండింగులో ఉంది.? ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పూర్తి కాదో చూస్తాం. ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరందిస్తాం.
జిల్లా కేంద్రంలో నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నియోజకవర్గ కేంద్రాల్లో వంద పడకల ఆసుపత్రులు, మండల కేంద్రాల్లో 40 పడకల ఆసుపత్రులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లాకు బ్రహ్మాండగా సాగునీరందించేందుకు టీఆర్ఎస్ వద్ద అద్భుతమైన ప్లాన్ ఉందన్నారు. జిల్లాకు చెందిన రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి కృష్ణానది నుంచి నీటిని కాల్వల ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లా పాకాల దాకా తీసుకువెళ్లే ప్రాజెక్టును రూపొందించారని చెప్పారు.
ఇది పూర్తయితే, జిల్లా సస్యశామలమేనని పేర్కొన్నారు. అంగ న్వాడీ, ఆశా వర్కర్లు, ఐకేపీ సిబ్బంది కష్టాలు కూడా తొలగిస్తానని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ‘కేసీఆర్‌గా మాట ఇస్తున్నా.. రెండేళ్లలో జిల్లాలోని ప్రతిఇంటికీ రక్షిత నీరిస్తా. జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించండి. సమస్యలు తీరాలంటే, టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి’ అని పేర్కొన్నారు.
నల్లగొండ, నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నకిరేకల్ ఇలా పేరు పేరునా ఒక్కో అభ్యర్థిని సభకు పరిచయం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జగదీశ్వర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, కిషోర్, శంకర మ్మ, నోముల నర్సింహయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, సునీత, ఎంపీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.
కోమటిరెడ్డికి .. కేసీఆర్ మినహాయింపు
నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి విమర్శల నుంచి మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ తన ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుని నీచుడితో పోల్చారు. తెలంగాణ అడ్డుపడ్డాడని దుయ్యబట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఏకంగా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. జిల్లాకు సంబంధించి జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలపైనా విమర్శలు వదిలారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డినైతే ‘ఉత్తమునివైతే శంకరమ్మపై పోటీ నుంచి విరమించుకోవాలని’ సవాల్ చేశారు. ఫ్లోరైడ్ సమస్యను తీర్చలేని జిల్లా మంత్రులవి ‘అసమర్థుని జీవితాలు’ అని వ్యాఖ్యానించారు. కానీ, నల్లగొండలో టీఆర్ఎస్కు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. త మ పార్టీ అభ్యర్థి కోసమైనా కనీసం రాజకీయ విమర్శలు చేయలేదు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడం వంటి అనుకూల అంశాలున్నందున కోమటిరెడ్డిపై విమర్శలు చేస్తే సబబు కాదని భావించినట్లు కనిపిస్తోంది. నల్లగొండలో సభ అనగానే, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు ఉంటాయని భావించినపార్టీ నేతలూ అవేమీ లేకపోవడంతో అవాక్కయ్యారు. సభకు హాజరైన పలువురు ఈ అంశంపై మాట్లాడుకోవడం కనిపించింది.