ఆదివాసీ మరణాలు
- అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
- కలెక్టర్ల సదస్సు రెండో రోజూ జిల్లాపై చర్చ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలో ఏటా జరుగుతున్న ఆదివాసీల మరణాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందుస్తు ప్రణాళిక సిద్దం చేయాలని సంబంధిత శాఖల జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు.
శనివారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో వర్షా కాలంలో విజృంభించే విషజ్వరాల అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. అలాగే మిషన్ కాకతీయ పథకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది చేపట్టిన పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మిషన్ కాకతీయ పనుల్లో భాగస్వాములుగా చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన వారందరికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సులో కలెక్టర్ ఎం.జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్, జెడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.