ఊరికి జ్వరమొచ్చింది..
రామాయంపేట(మెదక్): ఊరు మంచం పట్టింది. వైద్యసేవల్లేక ఊరు ఊరంతా విలవిలలాడుతోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో చికున్ గున్యా వణికిస్తోంది. గ్రామంలో 400 మంది చికున్‌గున్యాతో బాధపడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే. సరైన వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. గ్రామంలో పారిశుధ్యం లోపించింది. రోడ్లపై ఎక్కడ చూసినా మురుగునీరే. ఇళ్ల మధ్య నుంచే మురుగునీరు పారుతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవని, కేవలం రెండు, మూడు మందు బిళ్లలు ఇచ్చి పంపుతున్నారని బాధితులు వాపోతున్నారు.
మా దృష్టికి రాలేదు..
ఈ విషయమై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావును ‘సాక్షి’ఫోన్లో సంప్రదించగా గ్రామంలోని పరిస్థితి తమ దృష్టికి రాలేదన్నారు. వారికి చికున్ గున్యా వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ఇటీవల కొందరు గ్రామంలోని పీహెచ్సీకిరాగా, తమ సిబ్బంది చికిత్స చేసి పంపారని పేర్కొన్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.