child home
-
చైల్డ్ హోంకు అన్విత అప్పగింత
కోల్‌సిటీ(రామగుండం): బరువు తక్కువగా జన్మించిన ఆడశిశువు ఆ తల్లిదండ్రులకు భారమైంది. అప్పటికే అధిక సంతానం.. ఈ శిశువు బతకడం కష్టమని భావించి ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లారు. ఆస్పత్రి వైద్యసిబ్బంది అమ్మలా..లాలపోసి.. జోలపాడి.. పాలుపట్టి కంటికి రెప్పలా కాపాడడంతో ఆరోగ్యం మెరుగైంది. బరువూ పెరిగింది. శిశువును స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ సంఘటన గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అధిక సంతానం ఉన్న ఓ నిరుపేద దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 3న గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కవలలు జన్మించారు. వీరిలో మగశిశువు చనిపోగా.. ఆడశిశువు 920 గ్రామాలు బరువు మాత్రమే ఉంది. ఇక బతకడం కష్టమని భావించిన ఆ తల్లిదండ్రులు బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఎన్సీయూ విభాగం వైద్యులు, సిబ్బంది ఆ శిశువును అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. ఐదు రోజులో పది రోజులు కాదు.. ఏకంగా 105 రోజులు శిశువును కంటికి రెప్పలా కాపాడారు. ఏప్రిల్ 24న పాపకు ఆస్పత్రిలోనే నామకరణం వేడుక కూడా నిర్వహించారు. కొత్త బట్టలతో పాపను ముస్తాబు చేసి, ఉయ్యాలలో జోలపాడి అన్విత అని పేరుపెట్టారు. ఇప్పటివరకు అన్విత సంరక్షణ బాధ్యతలను ఎస్ఎన్సీయూ విభాగం వైద్యులు సమత, శ్రీలత, అద్వేష్రెడ్డి, సరళి, స్టాఫ్‌నర్స్‌లు కవిత, సంధ్య, రమ, రజని, సరిత, నీల, కేర్ సపోర్టింగ్ స్టాఫ్ సరోజన, కవిత, సరోజన చూశారు. మెరుగైన వైద్యంతోపాటు పోషకా హారం అందించడంతో శుక్రవారం వరకు 2,950 గ్రాముల బరువు పెరిగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో శుక్రవారం చైల్డ్‌హోంకు తరలించడానికి ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా అన్వితను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పాపను అప్పగిస్తుండగా బావోద్వేగంతో సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. వైద్యులు, సిబ్బంది అందరూ పాపతో కలిసి సంతోషంగా ఫొటో దిగారు. కరీంనగర్‌లోని చైల్డ్ హోంకు తరలిస్తున్నట్లు జిల్లా డీసీపీఓ జితేందర్, సీడీపీఓ స్వరూపరాణి, కనకరాజు తెలిపారు. అభినందించిన ఎమ్మెల్యే చందర్ శిశువు ప్రాణాలు కాపాడడమే కాకుండా మానవత్వంతో ఆలనాపాలన చూసి అరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దిన వైద్యులు, సిబ్బంది పనితీరు ఆదర్శనీయమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభినందించారు. పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకునే వారు శిశు సంక్షేమశాఖ ద్వారా తీసుకోవచ్చని తెలి పారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
బలవంతంగా మా పెళ్లిని అడ్డుకున్నారు
కడప అర్బన్ : కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు సాయినగర్‌లో ఉంటున్న ఎం.రాజ్‌కుమార్ తాను వివాహం చేసుకున్న ఎం.శిరీషాతో కలిసి వచ్చి.. తమకు న్యాయం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో వారు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ తమ పరిస్థితి వివరించారు. తాను పెద్దల సమక్షంలో ఈ ఏడాది ఏప్రిల్ 19న వివాహం చేసుకునేందుకు నిశ్చయం చేసుకోగా.. ముందు రోజు 18న రాత్రి 11 గంటల సమయంలో చైల్డ్ హోం నోడల్ ఆఫీసర్ సి.రామకృష్ణారెడ్డి, వీఆర్ఏ వెంకటేశ్వర్లు, వీఆర్వో సాల్మన్లు తదితరులు వచ్చి తమ వివాహాన్ని నిలుపుదల చేశారన్నారు. పెళ్లికుమార్తె వయసు నిర్ణీత వయసు కంటే తక్కువగా ఉందని, నిలుపుదల చేశారన్నారు. ఆమె 2000 ఫిబ్రవరి 22న జన్మించినట్లుగా ఆధార్ కార్డులో ఉందని, ఈ ప్రకారం మేజర్ అయిందని ఎంత చెప్పినా వినకుండా వారు వివాహాన్ని నిలిపి వేశారన్నారు. తాము చూపించిన ఆధారాల గురించి పట్టించుకోకుండా వివాహాన్ని రద్దు చేశారన్నారు. కానీ వివాహం ఆగిపోయినందుకు ఆ సమయంలో తాము తీసుకొచ్చిన లక్షన్నర మేరకు వస్తువులతోపాటు అంతకు ముందే లక్షన్నర మేరకు మొత్తం మూడు లక్షల రూపాయలు వృథాగా ఖర్చయ్యాయన్నారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోయమామని, మానసికంగా వేదన భరించామని చెప్పారు. తర్వాత పెద్దల సమక్షంలోనే వివాహం చేసుకున్నామన్నారు. తాము న్యాయవాది ద్వారా నోటీసులు వారికి పంపించినా స్పందన రాలేదన్నారు. కావున తమరు న్యాయం చేసి తగిన నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు రాజ్‌కుమార్, అతని సతీమణి శిరీష విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మినెంట్ లోక్ అదాలత్‌లో సమస్యను పరిష్కరిస్తామని సూచించారు. -
నేను పనికి పోను.. చదువుకుంటా!
మక్తల్: గొర్రెల కాపరిగా పని చేయాలని తల్లి పంపిస్తే... తాను పనికి వెళ్లను, చదువుకుంటానంటూ ఆ బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన వెంకటేశ్, కమలమ్మ దంపతులకు నవీన్‌కుమార్(10) సంతానం. నవీన్ తండ్రి వెంకటేశ్ గతేడాది మృతి చెందగా.. తల్లి రాయిచూర్‌లో గొర్రెలు కాసే పనికి కుమారుడిని కుదిర్చింది. అక్కడకు వెళ్లాలని ఒత్తిడి చేయగా.. తాను చదువుకుంటానంటూ నవీన్ శనివారం మక్తల్ పోలీసులను అ«శ్రయించారు. దీంతో మక్తల్ సీఐ వెంకట్, ఎస్ఐ వెంకటేశ్వర్లు జిల్లా కేంద్రంలోని చైల్డ్ హోంలో చేర్పించారు. -
చైల్డ్‌హోంలో విదేశీయుల సందడి
సేవా కార్యక్రమాలు చేపట్టిన బెల్జియం దేశస్తులు చౌటుప్పల్ (మునుగోడు) : మండలంలోని దండుమల్కాపురం గ్రామంలో గల వెబర్ చైల్డ్ హోమ్‌లో సోమవారం బెల్జియం దేశానికి చెందిన 12 మంది ప్రొఫెసర్లు, టీచర్లు సందడి చేశారు. ఈ నెల 13న రాష్ట్రానికి వచ్చిన సభ్యులు సోమవారం చైల్డ్ హోం సందర్శించారు. బెల్జియం దేశంలోని ఫార్ మిస్ టెర్రీ (భూమి మీది చీమలు) అనే స్వచ్ఛం ధ సంస్థకు చెందిన సభ్యులు ఆ దేశంలోని ఇన్ఫాంట్ డీలాఫాక్స్ సంస్థ తరఫున ఇక్కడికి వచ్చారు. పర్యటనలో భాగంగా హోం ఆవరణలో మొక్కలు నాటారు. 1992లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రతి రెండేళ్లకోసారి వివిధ దేశాల్లో పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రతినిధులు తెలిపారు. అనంతరం చైల్డ్ హోం లోని తరగతి, హాస్టల్ గదులకు రూ. ఐదు లక్షలు వెచ్చించి రంగులు వేశారు. అనాథ విద్యార్థులతో ఆప్యాయంగా.. బెల్జియం దేశం నుంచి వచ్చిన సభ్యులు చైల్డ్ హోంలోని అనాథ విద్యార్థులతో ఆప్యాయతను పంచుకున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. చైల్డ్‌హోంకు వచ్చిన వారిలో జెరాల్డ్, రోజ్, లూసీ, ఫాబ్రసీ, ఎలోడి, మేరి, కేథరిన్, అన్, బ్రిజిత్, అర్నాండ్, వేటేజర్, బావేతో పాటు చిన్నారులు జేన్, లూయిస్‌లు ఉన్నారు. -
శిశుగృహకు ఆడశిశువు అప్పగింత
పెద్దవూర మండలంలోని పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధి పాత జయరాంతండాకు చెందిన రమావత్ వనిత–రాము దంపతులు ఆడశిశువును సాకలేమని శనివారం పెద్దవూర ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తండాకు చెందిన రమావత్ వనిత–రాము దంపతులు నిరుపేద గిరిజనులు. వీరికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి మొదటి, రెండవ సంతానంగా ఆడపిల్లలే జన్మించారు. వంశాంకురం కోసం కుమారుడు కావాలని భావించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. మూడవ కాన్పులోనూ వనిత గత జూన్ 6వ తేదీన మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత శిశువుతో సహా పాత జయరాంతండాకు వచ్చింది. పాప జన్మించిన 15 రోజులకు తన తల్లిగారింటికి వెళ్తున్నానని చెప్పి జయరాంతండా నుంచి వెళ్లింది. ఆ తర్వాత నెలన్నర రోజులకు పాపను తీసుకురాకుండా ఒక్కతే ఇంటికి చేరింది. పాప ఏమైందని చుట్టుపక్కల వారు అడిగితే చనిపోయిందని చెప్పటంతో వారికి అనుమానం వచ్చింది. విషయాన్ని స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు చేరవేయడంతో వనితను నిలదీశారు. దీంతో అంగన్వాడీ కార్యకర్త పి.పద్మావతి, సూపర్వైజర్ ఎస్.వెంకాయమ్మలు విషయాన్ని సీరియస్‌గా తీసుకుని భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాపను సాకటానికి ఆర్థిక స్థోమత లేక తమ బంధువులకు సాదుకోవటానికి ఇచ్చానని చెప్పింది. దీంతో బంధువుల నుంచి శిశువును తీసుకువచ్చి సాకలేమని శనివారం స్థానిక కార్యాలయంలో గ్రామస్తుల సమక్షంలో ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అధికారులు శిశువును నల్లగొండ శిశుగృహకు తరలించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్.వెంకాయమ్మ, కార్యకర్త పి.పద్మావతి, గ్రామస్తులు దేవసాని శశిపాల్‌రెడ్డి, పాల్తీ శ్రీనునాయక్, కొంగరి రాములు, ఆయా జ్యోతి పాల్గొన్నారు. -
చైల్డ్‌హోమ్‌కు బిహార్ బాలలు
రైల్వేగేట్ : కలకత్తా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి అదుపులోకి తీసుకున్న 74 మంది బిహార్ రాష్ట్ర బాలలను పోలీసులు శనివారం సాయంత్రం వరంగల్ కొత్తవాడలోని చైల్డ్‌హోమ్‌కు తరలించారు. బాలుర తరలింపు విషయమై షీ టీమ్ సీఐ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ బాలలు ఎక్కడ చదువుతున్నారు.. ఎక్కడికెళ్తున్నారనే విషయాలను సేకరిస్తున్నామని తెలిపారు. వా రు వాస్తవంగా మదర్సాలలో చదివేందుకు వెళితే ఆయా మదర్సాల నుంచి తగిన ఆధారాలు కూడా తీసుకుని ఆ తర్వాత తగిన విధంగా స్పందిస్తామన్నారు. చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అనితారెడ్డి, చైల్డ్‌లైన్ ప్రతినిధులు సిద్దార్థ, శ్రీకాంత్, సోషల్‌కుమార్‌తో సివిల్, రైల్వే పోలీసులు ఉన్నారు. మదర్సాల్లో చదివించేందుకు తీసుకెళ్తున్నాం కాగా ఈ విషయమై బిహార్‌కు చెందిన ఎండీ తహజిబుల్, ఎండీ ముజాదిన్, షకీల్‌అహ్మద్, అబ్దుల్లా మాట్లాడుతూ బిహార్‌లోని పూర్ణియా, మాధవన్ జిల్లాలకు చెందిన బాలలను హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మదర్సాలలో చది వించేందుకు తీసుకెళ్తున్నామని, వారిని పనిలో పెట్టడానికి కాదని తెలిపారు. రంజాన్ సెలవులకు బిహా ర్కు వెళ్లిన బాలలు తిరిగి మదర్సాలలో చేరేందుకు వెళుతున్నట్లు వారు వివరించారు. కాజీపేటలో ఇద్దరు బాలలు.. కాజీపేట రూరల్ : వరంగల్ రైల్వేస్టేలో 74 మంది బాలలను దింపాక హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులోనే ఉండిపోయిన ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నట్లు కాజీపేట జీఆర్పీ సీఐ మధుసూదన్ శనివారం రాత్రి తెలిపారు. షఫీక్ అనే వ్యక్తి హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు బాలలను వికారాబాద్‌కు తీసుకెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
చైల్డ్ హోమ్‌కు నవ వధువు
వికారాబాద్ (రంగారెడ్డి ): ఓ బాల్య వివాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు వెళ్లగా అప్పటికే పెళ్లి జరిగిపోయింది. దీంతో చేసేది లేక ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ చేసి అమ్మాయిని నగరంలోని చైల్డ్‌హోంకు తరలించారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని వెంకటపూర్ తండాకు చెందిన పదో తరగతి పూర్తి చేసిన బాలిక(15)ను అదే గ్రామానికి చెందిన యువకుడు శ్రీశైలానికి ఇచ్చి శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కొందరు చైల్డ్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి సమచారం ఇచ్చారు. స్పందించిన చైల్డ్‌లైన్ అధికారులు వికారాబాద్ ఎస్ఐ రవీందర్‌తోపాటు వీఆర్ఓ రవికి, చైల్డ్‌లైన్ సిబ్బంది దేవకుమారి, రామేశ్వర్‌తో కలిసి శుక్రవారం ఉదయం 8 గంటలకు తండాకు వెళ్లారు. అయితే, అప్పటికే వివాహం జరిపించడంతో సదరు అధికారులు ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సెలింగ్ చేశారు. బాలికకు వివాహం చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల కుటుంబీకులు పొరపాటు జరిగిందని అధికారులను వేడుకున్నారు. అనంతరం అధికారులను బాలికను నగరంలోని చైల్డ్‌హోంకు తరలించారు. -
మానసిక వికలాంగుల పాఠశాలను సందర్శించిన జగన్