Child Insurance Policy
-
పిల్లల బీమా.. ఇవ్వదు ధీమా..!
తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన ఆర్థిక లక్ష్యాల్లో పిల్లల విద్య ఒకటి. విద్యా వ్యయాలు ఏటేటా 10 శాతానికి మించి పెరుగుతున్నాయి. సాధారణ ద్రవ్యోల్బణం 5.5 శాతంతో పోల్చితే రెట్టింపు స్థాయి ద్రవ్యోల్బణం విద్యారంగంలో చూడొచ్చు. దీని కారణంగా నేడు ఒక కోర్స్‌కు రూ. 25 లక్షలు ఖర్చవుతుంటే.. 13 ఏళ్ల తర్వాత (ఉన్నత విద్యకు వచ్చే సరికి) రూ.1.09 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ముందస్తు ప్రణాళికతోనే ఈ వ్యయాలను అధిగమించడం సులభమవుతుంది.పాఠశాల ప్రవేశం నాటి నుంచే పిల్లల విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించాలి. భవిష్యత్‌లో ఎంత అవసరమో, ఆ మేరకు సమకూర్చుకునే విధంగా ప్రతి నెలా పొదుపు, మదుపు చేస్తూ వెళ్లాలి. ఇందుకు ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలకంగా మారతాయి. ఇక్కడ తప్పటడుగులు వేస్తే పిల్లల ఉన్నత విద్య కోసం రేపు అప్పు చేయాల్సి రావచ్చు. కేవలం చైల్ట్ ఇన్సూరెన్స్ పాలసీలతో విద్యా వ్యయాలను తట్టుకోవడం కష్టమే. ఈ దిశగా అవగాహన కల్పించే కథనమిది... తల్లిదండ్రుల్లో ఎంత మంది తమ పిల్లల భవిష్యత్ విద్యకు సన్నద్ధంగా ఉన్నారు? ఇదే తెలుసుకుందామని హెచ్ఎస్బీసీ సంస్థ ఓ సర్వే చేసింది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్ రిపోర్ట్ 2024’ పేరుతో నివేదిక విడుదల చేసింది. 53 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం పెట్టుబడులు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే తమ పిల్లలే విద్యా రుణం తీసుకుంటారని 40 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. కొందరు ఆస్తులు అమ్మి చదివిస్తామని చెప్పగా, స్కాలర్íÙప్ మార్గాలు చూస్తామని కొంతమంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ, పిల్లల పేరిట పెట్టుబడులు చేస్తున్న వారిలో ఎంత మంది మెరుగైన సాధనాలను ఎంపిక చేసుకున్నారన్నది ఈ సర్వే తేల్చలేదు. మొత్తానికి సగం మందికి ఆర్థిక ప్రణాళిక లేదని స్పష్టమవుతోంది. తల్లిదండ్రులకు ఏదైనా జరగరానిది జరిగితే... పిల్లల విద్యకు ఆరి్థక తోడ్పాటు అందించే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మార్కెట్లో క్రేజ్ ఉంది. బీమా ఏజెంట్లు వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. నిజానికి వీటిలో చార్జీలు ఎక్కువ. దాంతో రాబడులు కొంత తక్కువ. పిల్లల పేరిట మార్కెటింగ్ చేసే ఉత్పత్తుల వలలో పడకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా బీమా, పెట్టుబడులను కలపడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఈ రెండింటినీ వేర్వేరుగానే చూడాలి.చైల్డ్ ప్లాన్లలో ఏముంది?పిల్లల పేరిట రెండు రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. యూనిట్ లింక్డ్ చి్రల్డన్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యులిప్‌లు) ఇందులో ఒక రకం. చెల్లించిన ప్రీమియంలో బీమా రిస్క్, నిర్వహణ, ఇతరత్రా వ్యయాలు పోను మిగిలిన మొత్తాన్ని మార్కెట్ లింక్డ్ (ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత) సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. పాలసీదారుల ఎంపిక మేరకు డెట్‌లోనూ పెట్టుబడులు పెడతాయి. వచ్చిన రాబడులను పాలసీదారులకు అందిస్తాయి. ఎండోమెంట్ చిల్డ్రన్ ఇన్సూరెన్స్ రెండో రకం. ఇందులోనూ బీమా రిస్క్, ఇతర వ్యయాలు పోను మిగిలిన ప్రీమియాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి.పాలసీదారులకు హామీ మేరకు రాబడులు అందిస్తాయి. కానీ, వీటిలో రాబడులు 5–6 శాతం మించవు. ఈక్విటీ ఆధారిత యులిప్ ప్లాన్లలో రాబడులు కాస్త అధికంగా ఉంటాయి. కాకపోతే గ్యారంటీడ్ కావు. మార్కెట్ పనితీరుపైనే రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ రెండు రకాల ప్లాన్లలోనూ, పాలసీ కాల వ్యవధి ముగియక ముందే పాలసీదారు (తల్లి లేదా తండ్రి) మరణించినా లేక కాల వ్యవధి ముగిసేవరకు జీవించి ఉన్నా ప్రయోజనం లభిస్తుంది. పాలసీ కాల వ్యవధి మధ్యలో పాలసీదారు మరణించినట్టయితే, అప్పుడు బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి పెట్టుబడులను కొనసాగించి, యథాప్రకారం పాలసీ ప్రయోజనాలను అందిస్తుంది. దాంతో పిల్లల ఉన్నత విద్యకు ఆ నిధిని ఉపయోగించుకోవచ్చు. ‘‘దురదృష్టవశాత్తూ తల్లి లేదా తండ్రి మరణించినట్టయితే పరిహారం చెల్లించే ఈ పథకాలు పిల్లలకు ఉపయోగపడతాయి. ప్రీమియం వేవర్ ముఖ్యమైన సదుపాయం. పాలసీదారు మరణించినట్టయితే ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యాక్టివ్‌గా కొనసాగుతుంది. పిల్లల విద్యా లక్ష్యాలకు కావాల్సినంత మేర సమకూరుతుంది’’ అని ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ యాక్చువరీ ఆదిత్య మాల్ వివరించారు. పాలసీదారు మరణించినప్పటికీ గడువు తీరిన తర్వాత సమ్ అష్యూర్డ్, ఇతర ప్రయోజనాలు యథావిధిగా అందుతాయని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మధుపం కృష్ట సైతం తెలిపారు. సమ్ అష్యూర్డ్ (బీమా) వెంటనే చెల్లించి, మిగిలిన ప్రయోజనాలను పాలసీ గడువు ముగిసిన తర్వాత చెల్లించేవి ఉన్నాయి.లాకిన్ పిరియడ్... ఎండోమెంట్, యులిప్ ప్లాన్లు లాకిన్ పీరియడ్‌తో వస్తాయి. సాధారణంగా ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే మొదటి ఐదేళ్లు ఉపసంహరణకు అనుమతి ఉండదు. ఈ కాలంలో పాలసీని సరెండర్ చేసినా వచ్చేదేమీ ఉండదు. లాకిన్ పీరియడ్ తర్వాత పాక్షికంగా ఉపసహరించుకోవచ్చు. నిర్బంధంగా పెట్టుబడిని కొనసాగించే లక్ష్యంతోనే ఈ ప్లాన్లలో లాకిన్ ఉంటుంది. వీటిలో ఏజెంట్లకు కమీషన్ మెరుగ్గా ఉంటుంది. ఎంత అధిక ప్రీమియానికి పాలసీలో చేరి్పస్తే ఏజెంట్‌కు అంత అధికంగా కమిషన్ ముడుతుంది. ‘‘టర్మ్ ప్లాన్లు, మ్యూచువల్ ఫండ్స్ గురించి సరైన అవగాహన లేకపోవడమే పెద్ద సమస్య. టర్మ్ ప్లాన్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కనుక వీటిని ఏజెంట్లు విక్రయించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు’’అని కృష్ణ వివరించారు.ఆరి్థక ప్రణాళికలో చేసే తప్పుల్లో బీమా, పెట్టుబడి కలపడం ఒకటని ఆనంద్‌రాఠి వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరాగ్ ముని తెలిపారు. ‘‘ఇన్సూరెన్స్, పెట్టుబడి పూర్తి భిన్నమైన ఆరి్థక ఉత్పత్తులు. ఇన్వెస్టర్లు వీటిని కలపకూడదు. ఊహించని నష్టం నుంచి రక్షణ కల్పించడమే బీమా ఉద్దేశం. పెట్టుబడి సాధనం ఉద్దేశం సంపద సమకూర్చుకోవడం’’ అని వివరించారు. ‘‘సంప్రదాయ ఎండోమెంట్ పాన్లలో రాబడులు 4–5 శాతం మేర ఉంటాయి. విద్యా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే సంప్రదాయ బీమా ప్లాన్లలో పెట్టుబడితో మిగిలేదేమీ ఉండదు.చైల్డ్ యులిప్ ప్లాన్లలో 9–11 శాతం మేర రాబడులు వస్తాయి. కాకపోతే ఆరి్థక సైకిల్, మార్కెట్ సైకిల్‌పైనే ఈ రాబడులు ఆధారపడి ఉంటాయి’’ అని కృష్ట తెలిపారు. కనుక సంప్రదాయ ఎండోమెంట్ ఆధారిత చైల్డ్ ప్లాన్లు పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇవ్వమని స్పష్టమవుతోంది. ఇక యులిప్ ప్లాన్ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఎంపిక అవుతుంది. వీటిల్లో లిక్విడిటీ మెరుగ్గా ఉంటుంది. చార్జీలు చాలా తక్కువ. యులిప్ ప్లాన్లలో చార్జీల విషయమై పారదర్శకత తక్కువ. ప్రీమియం అలోకేషన్ చార్జీ, అడ్మిని్రస్టేటివ్ చార్జీ, మోర్టాలిటీ చార్జీ, సరెండర్ చార్జీ, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ ఇన్నేసి చార్జీలు యులిప్‌లలో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లోనూ పారదర్శకత ఎక్కువ.మెరుగైన ప్రత్యామ్నాయాలు..చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మెరుగైన ప్రయోజనాన్ని ఇవ్వనప్పుడు వీటికి ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ఊహించనది జరిగితే వారసుల విద్య ఆగిపోకూడదు. కుటుంబ జీవనం ఇబ్బందుల పాలు కాకూడదు. అందుకని జీవిత బీమాతోపాటు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఎంపిక చేసుకోవడం మంచి మార్గం అవుతుంది. ‘‘టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీని ఇస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల చైల్డ్ ప్లాన్ల కంటే మెరుగైన రాబడులు వస్తాయి.చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ తగినంత ఉండదు. అప్పుడే కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టిన వారికి, తాజాగా రుణం తీసుకున్న వారికి మరింత కవరేజీ అవసరం ఏర్పడుతుంది’’ అని కృష్ట తెలిపారు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు సరిపోలే పథకాలను ఎంపిక చేసుకోవచ్చని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ రేణు మహేశ్వరి సూచించారు. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.కోటి టర్మ్ ఇన్సూరెన్స్ రూ.10–15 వేల ప్రీమియంకే వస్తుంది. కనుక చైల్డ్ ప్లాన్ల కోసం ఏటా భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి బదులు.. టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసు కోవాలి.విభిన్న ఫండ్స్...టర్మ్ప్లాన్లోనూ మరణం లేదా అంగవైకల్యం పాలైనప్పుడు చెల్లింపులు చేసే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. సమ్ అష్యూర్డ్‌లో 50 శాతం మేర తక్షణమే చెల్లించి, మిగిలినది ప్రతి నెలా 10 ఏళ్ల పాటు చెల్లింపుల సదుపాయాలతో టర్మ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ఏటా 12 శాతం, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. పదేళ్ల కాలంలో అయితే సగటు వార్షిక రాబడి 20 శాతంగా ఉంది. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్ (సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్)ను ఎంపిక చేసుకోవాలి.ఇందులో చార్జీలు చాలా తక్కువ. సూచీల మాదిరే రాబడులు వీటిల్లో వస్తాయి. మరీ ముఖ్యంగా 7 ఏళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేస్తుంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్స్ పెట్టుబడులు పెట్టే ఫ్లెక్సీక్యాప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, రిస్క్ తక్కువ కోరుకునే వారు మల్టీ అస్సెట్ ఫండ్స్, రిస్క్ ఇంకా తక్కువగా ఉండాలని కోరుకునే వారు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణుల సూచన. పన్ను ప్రయోజనంచైల్డ్ యులిప్ ప్లాన్లలో రాబడులపై పన్ను భారం లేకపోవడాన్ని సానుకూల అంశంగా చెప్పుకోవాలి. దీనికి బదులు టర్మ్‌ప్లాన్ విడిగా తీసుకుని, ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఈక్విటీ లాభాలపై స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను కదపకుండా, ఒక పథకం నుంచి మరో పథకానికి మార్చకుండా.. స్థిరంగా ఒకే పథకంలో కొనసాగించడం వల్ల అనవసర పన్ను భారాన్ని తప్పించుకోవచ్చు. అయినా సరే ఈక్విటీ పెట్టుబడిని ఉపసంహరించుకున్నప్పుడు అది ఏడాది మించిన కాలం అయితే మొదటి రూ.లక్షకు మించిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.ఏడాదిలోపు పెట్టుబడులపై వచ్చే లాభం నుంచి 20 శాతం మేర పన్ను కింద చెల్లించాలి. నిపుణుల పెట్టుబడి ప్రణాళికను అనుసరించినట్టయితే అప్పుడు మెరుగైన జీవిత బీమా రక్షణ, ఈక్విటీలపై అద్భుత రాబడులు అందుకోవడానికి అవకాశాలుంటాయి. పన్ను చెల్లింపులు పోను నికర రాబడులు చైల్డ్ ప్లాన్లతో పోల్చితే.. అధికంగానే ఉంటాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ పన్ను ప్రయోజనం కోసమని యులిప్ పాలసీకే మొగ్గు చూపేట్టు అయితే విడిగా టర్మ్‌ప్లాన్ తీసుకోవడం మర్చిపోవద్దు. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
చిన్నారి బీమా...ధీమానిస్తుందా?
పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నవి చైల్డ్ ప్లాన్లు. అయితే, వీటి గురించి పూర్తిగా తెలిసినది అతి తక్కువ మందికే. బీమా ఏజెంట్లు చైల్డ్ ప్లాన్ల గురించి ఆకర్షణీయమైన అంశాలు... ఆకర్షణీయ రాబడుల గణాంకాలను చూపించినప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఏర్పడవచ్చు. అంతేకాదు, కొందరు వెంటనే ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రారంభిస్తారు. ‘దిగితేకానీ లోతు ఎంతో తెలియదు’ అన్న చందంగా ఈ ప్లాన్లను అభివర్ణించాల్సి ఉంటుంది. ‘నీ ముక్కు ఏది?’ అని ప్రశ్నిస్తే తలచుట్టూ వేలిని తిప్పి చూపించినట్టుగా చైల్డ్ ప్లాన్లను పేర్కొనక తప్పదు. ప్రీమియం భారం... చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, ఇన్వెస్ట్‌మెంట్‌తో కలసి ఉంటాయి. వీటిని ఎండోమెంట్ పాలసీలుగానే చూడాల్సి ఉంటుంది. వీటిల్లో పాలసీదారులకు ఎంతొస్తుందన్నది పక్కన పెడితే.. పాలసీ చేయించిన ఏజెంట్‌కు మాత్రం మంచి కమీషన్ ముడుతుంది. ముఖ్యంగా ఈ పాలసీల్లో ఇన్వెస్ట్ చేసే వారిని ప్రధానంగా ఆకర్షించే అంశం ఒకటుంది. పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే.. ఆ తర్వాత కూడా ఈ పాలసీ కొనసాగుతుంది. కాకపోతే ఆ తర్వాత వార్షిక ప్రీమియంలను కట్టే బాధ్యత పాలసీదారుడి కుటుంబంపై పడదు. పాలసీదారుడి తరఫున బీమా కంపెనీయే పాలసీ గడువు తీరే వరకు వార్షిక ప్రీమియంను జమ చేస్తూ మెచ్యూరిటీ తర్వాత అసలు, రాబడులను కలిపి చెల్లిస్తుంది. చూడ్డానికి బాగానే ఉంది కానీ.. ఈ సదుపాయం కోసం పాలసీదారుడు భారీ ప్రీమియంను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పాలసీ గడువు తీరే వరకు పాలసీదారుడు జీవించి ఉంటే చివర్లో వచ్చే రాబడులు చాలా తక్కువ. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పూడ్చుకునేందుకు సరిపోతాయో లేదో కూడా అనుమానమే. పాలసీల్లో చేరాలని కోరే బీమా ఏజెంట్లు ఈ చైల్డ్ ప్లాన్లలో ఉండే వివిధ చార్జీల గురించి వివరంగా చెప్పడం అరుదే. ఎండోమెంట్ ప్లాన్ బీమా ఏజెంట్లు మార్కెటింగ్ చేసే చిన్నారి పథకాల్లో ఎక్కువగా ఎండోమెంట్ ప్లాన్లే ఉంటున్నాయి. ఇవి పొదుపు, బీమా కలసిన ప్లాన్లు. బీమా ప్లాన్లు కావడంతో పెట్టుబడులకు సంబంధించిన వివరాల్లో పారదర్శకత చాలా తక్కువ. పెట్టుబడుల వివరాలను కంపెనీలు వెల్లడించవు. సాధారణంగా డెట్ సాధనాల్లోనే బీమా సంస్థలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డెట్ సాధనాల్లో రాబడులు 7–9 శాతం మించవని తెలిసిందే. బీమా రిస్క్ చార్జీలను కంపెనీలు మినహాయించుకుంటాయి. దీంతో చెల్లించే ప్రీమియం అంతా పెట్టుబడులకు వెళ్లదు. ఫలితంగా దీర్ఘకాలానికి సగటు రాబడులు ఈ ప్లాన్లలో 4–5 శాతం వరకే ఉంటాయి. ఒకవేళ పిల్లల పేరిట పాలసీ తీసుకున్న పేరెంట్ (తల్లి లేదా తండ్రి)... పాలసీ ఆరంభమైన తొలినాళ్లలో మరణిస్తే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (రాబడి రేటు) కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. స్థూల రాబడి రేటును 8 శాతం అంచనాగా చూపించినప్పటికీ.. నికర రాబడులు 5 శాతం మించవు. పార్టిసిపేటింగ్ ప్లాన్ల (బీమా లాభాల నుంచి వాటా లభించేవి)లో రాబడి రేటు దీనికి కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఏటా బోనస్ చెల్లిస్తాయి కనుక. అయితే, ఈ బోనస్‌ను ఏటా ప్రకటించాలన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత ఐదేళ్లలోపు తప్పుకుంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం మొత్తంలో చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే బీమా సంస్థలు వివిధ చార్జీలను మినహాయించుకుని మిగిలినది చెల్లిస్తాయి. కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నారుల భవిష్యత్తు లక్ష్యాలకు వారు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడం దీని కంటే మంచి ఆప్షన్ అవుతుంది. డెట్ సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులే మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, చిన్నారుల ఉన్నత విద్య, వివాహం ఇతర లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయకుండా భిన్న సాధనాల మధ్య (పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన) మధ్య వర్గీకరించుకోవడం వైవిధ్యంతో కూడుకున్న ఆప్షన్ అవుతుంది. చైల్డ్ యులిప్‌లు చిన్నారుల పేరుతో ఆఫర్ చేసే యులిప్ ప్లాన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇవి కూడా బీమా, పెట్టుబడులు కలగలసిన సాధనాలు. ఇవి ఈక్విటీ మార్కెట్‌తో ముడిపడిన సాధనాలు. బీమా, ఇతర ఖర్చులు పోను చెల్లించిన ప్రీమియంలో మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో బీమా కంపెనీలు ఇన్వెస్ట్ చేసి, వచ్చిన రాబడులను పాలసీదారులకు పంచుతుంటాయి. ఈ ప్లాన్లలో ఈక్విటీ లేదా డెట్.. ఈక్విటీ, డెట్ కలిసిన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ ఆప్షన్‌తో కూడిన యులిప్ ప్లాన్లలో రాబడులు ఎండోమెంట్ ప్లాన్లతో పోల్చుకుంటే కాస్త నయమే. ఈక్విటీ ఆప్షన్‌తో కూడిన ప్లాన్లలో దీర్ఘకాలంలో సగటున 7–8 శాతం రాబడులను ఆశించొచ్చు. స్థూల, నికర రాబడుల మధ్య వ్యత్యాసం కూడా 2 శాతాన్ని మించి ఉండదు. అయితే, యులిప్ ప్లాన్లలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇందులోనూ బీమా రక్షణ ఉంటుంది. చిన్నారుల కోసం యులిప్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి ఉన్నట్టయితే.. మ్యాక్స్ లైఫ్ శిక్షా ప్లస్ సూపర్ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. ఇది నాన్ పార్టిసిపేట్ యులిప్ ప్లాన్. ఇందులో ఆరు రకాల ఫండ్లలో ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది. డైనమిక్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఎంచుకున్నట్టయితే.. పాలసీ ఆరంభంలో ప్రీమియంను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పాలసీ కాల వ్యవధి గడుస్తున్న డెట్‌తో కూడిన కన్జర్వేటివ్ ఫండ్‌కు పెట్టుబడులను మళ్లిస్తుంది. అలాగే, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ యంగ్‌స్టార్ సూపర్ ప్రీమియం కూడా చైల్డ్ యులిప్ ప్లానే. ఇందులోనూ నాలుగు రకాల ఫండ్ ఆప్షన్లు ఉన్నాయి. చిన్నారుల పేరిట బీమా.. చిన్నారులకు బీమా రక్షణ కల్పించే ప్లాన్లు కూడా ఉన్నాయి. పిల్లలకు ఏదైనా జరిగితే పరిహారాన్ని తల్లిదండ్రులకు చెల్లించడం జరుగుతుంది. ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ ఇటువంటిదే. బీమా రక్షణ అనేది కుటుంబానికి ఆధారమైన వ్యక్తి కోసం ఉద్దేశించినది. అతనికి ప్రాణాపాయం వాటిల్లితే అతని పిల్లల చదువులకు ఇబ్బంది రాకూడదు. బీమా ఉంటే వచ్చే పరిహారం ఇందుకు ఉపయోగపడుతుంది. పిల్లలు ఎవరిమీద ఆధారపడ్డారో వారికి బీమా ఉండాలి. అంతే కానీ, పిల్లల పేరిట బీమా ఉంటే ఉపయోగం ఏమీ ఉండదు. కనుక పిల్లల పేరిట బీమాతో కూడిన పాలసీలను తీసుకోవడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. బీమా తగినంత ఉంటుందా..? చైల్డ్ ప్లాన్లలో బీమా రక్షణ వార్షిక ప్రీమియానికి 10 రెట్లకు మించదు. పాలసీదారు మరణించే నాటికి వార్షిక ప్రీమియానికి పది రెట్లు లేదా అప్పటి వరకు చెల్లించిన ప్రీమియానికి 105 శాతం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మేరకు బీమా పరిహారం చెల్లించడం జరుగుతుంది. ఈ ప్రకారం చూస్తే ఒకవేళ వార్షికంగా చెల్లించే ప్రీమియం రూ.50,000 ఉందనుకున్నా.. బీమా కవరేజీ రూ.5లక్షలుగానే ఉంటుంది. కానీ, పిల్లల ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఇది ఏ మూలకు సరిపోతుంది..? అందుకే కుటుంబానికి, భవిష్యత్తు లక్ష్యాలకు బీమా రక్షణ కల్పించాలంటే అందుకు ఈ తరహా చైల్డ్ ప్లాన్లు లేదా ఎండోమెంట్ పాలసీలు ఏ విధంగానూ అనుకూలం కావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లింపుల్లో సౌలభ్యం..? ఇక చైల్డ్ ప్లాన్లలో పిల్లల అవసరాలకు అనుగుణంగా చెల్లింపులను ఎంచుకునే సౌలభ్యం తక్కువే. ఉదాహరణకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ చాంప్ ఇన్సూరెన్స్ లో చెల్లింపులు పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రారంభం అవుతాయి. వార్షికంగా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లింపులు జరుగుతాయి. ఒకవేళ 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఏకమొత్తంలో చెల్లింపులు కోరుకుంటే ఆ అవకాశం లేదు. అదే విధంగా బజాజ్ అలియాంజ్ యంగ్ అష్యూర్ ప్లాన్‌లోనూ ఏక మొత్తంలో మెచ్యూరిటీ ప్రయోజనాలను చెల్లించే ఆప్షన్ లేదు. పాలసీ కాల వ్యవధి 10, 15, 20 ఏళ్లుగా ఉండగా, ఈ కాల వ్యవధి ముగిసిన తర్వాత 3/5/7 వాయిదాల్లో బీమా సంస్థ చెల్లింపులు చేస్తుంది. ఇలా కాకుండా మ్యాక్స్ లైఫ్ ఫ్యూచర్ జీనియర్ ఎడ్యుకేషన్ ప్లాన్‌లో అయితే 16, 18, లేదా 21 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ చెల్లించే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లను తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యాన్ని గమనించినట్టయితే.. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ పిల్లల విద్య, ఇతర కుటుంబ లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటుంటారు. కానీ, ఇందుకు టర్మ్ లైఫ్ ప్లాన్ చక్కగా సరిపోతుంది. ఎక్కువ చార్జీలను పిండుకునే ఈ తరహా చైల్డ్ప్లాన్లు లేదా ఎండోమెంట్ పాలసీలు, యులిప్‌లకు బదులు టర్మ్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. టర్మ్ పాలసీల్లో మెచ్యూరిటీ అనంతరం ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అందుకే తక్కువ ప్రీమియానికి ఎక్కువ కవరేజీ లభిస్తుంది. దీంతో కుటుంబం కోసం ఎక్కువ కవరేజీతో కూడిన ప్లాన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల ఉన్నత విద్య, కుటుంబ పోషణ, ఇతర లక్ష్యాలకు రూ.కోటి కవరేజీతో టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే.. ప్రీమియం 30 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రూ.10,000గానే ఉంటుంది. కనుక ఇటువంటి గందరగోళాలకు తావివ్వని, సులభమైన, సూటి అయిన టర్మ్ ప్లాన్ మేలైనది. భవిష్యత్తు లక్ష్యాల కోసం పెట్టుబడులు పెట్టుకోవాలని భావిస్తే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్, పీపీఎఫ్ వంటి పథకాలను ఎంచుకోవచ్చు. -
ప్రీమియంల చెల్లింపులకు ‘ఈ’ దారి రహదారి..
కృష్ణకు కూతురంటే ఎంతో ఇష్టం. ఆమె ఉన్నత విద్యకు చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. మూడు నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తున్నాడు. పాలసీ మురిగిపోకుండా సమయానికి ప్రీమియం చెల్లించడం ఆయన పద్ధతి. అయితే ఇందుకు భిన్నంగా జరిగిపోయింది. రెండు ప్రీమియంలు వరుసగా చెల్లించలేకపోయాడు. మార్కెటింగ్ ఉద్యోగంలో పలు ప్రాంతాలు తిరగాల్సిరావడం దీనితో సంబంధిత కార్యాలయానికి వెళ్లి ప్రీమియం చెల్లించడానికి తగిన సమయం అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఫలితం పాలసీ మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. తిరిగి పునరుద్ధరించుకోడానికి కొంత సమయం, ప్రయాస తప్పదు. కృష్ణకే కాదు. చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇలాంటి వారికందరికీ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్) చక్కని మార్గం. ఆటోమేటిక్ ప్రీమియం చెల్లింపులకు సులభమైన పద్ధతి. ఇక బిజీ కస్టమర్లకు ఈసీఎస్ ఎంతో సౌకర్యవంతం. ఈసీఎస్ అంటే ఏమిటి? ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు ఆటోమేటిక్‌గా డబ్బు బదలాయింపునకు ఉద్దేశించినదే ఈసీఎస్. బీమా ప్రీమియంల నుంచి మరే ఇతర బిల్లు చార్జీల చెల్లింపులైనా క్రమబద్ధంగా జరపడానికి ఇది చక్కని మార్గం. ఉదాహరణకు నిర్ణీతకాలంలో క్రమానుగుణంగా ప్రీమియం సొమ్ము చెల్లింపునకు వీలుగా మీ బ్యాంక్ అకౌంట్‌కు పాలసీ నంబర్‌కు అనుసంధానం చేయడం, దీనివల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా సంబంధిత మొత్తం గడువుతేదీనాటికి మీ ప్రీమియం కింద జమవుతుంది. ఈ అనుసంధానం తరువాత, డిఫాల్ట్, ల్యాప్స్... వంటి పదాలకే అవకాశం ఉండదు. వ్యక్తిగత శ్రమా తప్పుతుంది. డబ్బుకూ భరోసా ఉంటుంది. ఈ విధానంలో పాలసీ హోల్డర్ అకౌంట్, పాలసీ వివరాలు సైతం రహస్యంగానే ఉండడం మరో ప్రత్యేకత. పైగా ఈ సౌకర్యం వినియోగించుకున్నందుకు అటు బ్యాంక్ గానీ, ఇటు బీమా కంపెనీగానీ మీపై ఎటువంటి అదనపు చార్జీల భారం విధించబోవు. బ్యాంక్, బీమా వంటి సంస్థలకు కూడా ఈ విధానం విస్తరణ వల్ల వ్యయ, నిర్వహణా పరమైన ఇబ్బందులు చాలా వరకూ తగ్గిపోతాయి. ప్రారంభం ఎలా..! ఈసీఎస్ సౌలభ్యం పొందడానికి తొలుత మీరు పాలసీ కడుతున్న బీమా సంస్థ ద్వారాగానీ లేక మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ ద్వారాకానీ ఆన్లైన్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. లేదా స్వయంగా ఆయా సంస్థల నిర్దేశిత దరఖాస్తులను పూర్తిచేసి సమర్పించినా తదుపరి ఆన్లైన్ అనుసంధాన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఆయా సందర్భాల్లో కొన్ని సంస్థలు ఒక కేన్సిలేషన్ చెక్‌ను కూడా కోరుతున్నాయి. డబ్బు జమకు సంబంధించిన వివరాలు సైతం మీ మొబైల్‌కు లేదా మీ ఈ మెయిల్‌కు వచ్చే వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో ఉంది. పట్టణ స్థాయి నుంచి నగరస్థాయి వరకూ దాదాపు ఇప్పుడు కస్టమర్లు అందరికీ ఈసీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చేసింది. చివరిగా చెప్పేదేమిటంటే... మీ బ్యాంక్ అకౌంట్లో ‘చెల్లింపులకు తగిన డబ్బు’ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలన్న విషయం మీరు సదా గుర్తుంచుకోవాలి.