child marriages in ap
-
ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 29.3 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు (బాల్య వివాహాలు) అయిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు నిండకముందే 32.9 శాతం మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు అవుతుండగా, పట్టణ ప్రాంతాల్లోనూ 21.7 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు అవుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. గతంలో కంటే ఈ తరహా పెళ్లిళ్ల శాతం కొంత మేర తగ్గినట్లు సర్వే పేర్కొంది. గతంలో 18 ఏళ్లలోపు అమ్మాయిల పెళ్లిళ్లు 33 శాతం ఉండగా, ఇప్పుడు 29.3 శాతంగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సమయంలో రాష్ట్రంలో 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సుగల పెళ్లి చేసుకున్న మహిళలు అప్పటికే తల్లి కావడం కానీ, గర్భంతో ఉండటం గానీ గుర్తించారు. వీరి శాతం పట్టణాల్లో 9.3 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 14.1గా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 18 ఏళ్లకన్నా ముందుగానే 37.3 శాతం మంది అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకున్నట్లు సర్వే తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 22.1 శాతం ఈ తరహా పెళ్లిళ్లు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 41.6 శాతం, బీహార్లో 40.8 శాతం 18 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లిళ్లు అయినట్లు సర్వే పేర్కొంది. -
బాల్యవివాహాలు అరికట్టాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: బాల్యవివాహాల అంశాన్ని రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి లేవనెత్తారు. బాల్యవివాహాల నిరోధక చట్టం-2006 ఉన్నా.. ఏపీలో సరిగా అమలు కావడం లేదన్నారు. బాల్య వివాహాలలో ఏపీలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. 20,584 మంది బాలికలు, 19,557 మంది బాలురకు వివాహ వయసుకు ముందే బాల్య వివాహాలు జరిగాయని వెల్లడించారు. విశాఖ, అనంతపురం, కర్నూల్, చిత్తూరు జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని చెప్పారు. విశాఖలో 16,876 మంది బాలికలు, అనంతపురం జిల్లాలో 16,738 మంది బాలికలు కర్నూలు జిల్లాలో 16,532 మంది బాలికలు, చిత్తూరు జిల్లాలో 15, 769 మంది బాలికలు బాల్యవివాహాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. బాల్య వివాహాలు సమాజంపై తీవ్ర దుష్పరిణామం చూపిస్తాయని.. దీనివల్ల ఆడపిల్లల విద్యావకాశాలు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తిచేశారు. బాల్యవివాహాల వల్ల తలెత్తే సమస్యలు, అనర్ధాలపై గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.