ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 29.3 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు (బాల్య వివాహాలు) అయిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు నిండకముందే 32.9 శాతం మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు అవుతుండగా, పట్టణ ప్రాంతాల్లోనూ 21.7 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు అవుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. గతంలో కంటే ఈ తరహా పెళ్లిళ్ల శాతం కొంత మేర తగ్గినట్లు సర్వే పేర్కొంది. గతంలో 18 ఏళ్లలోపు అమ్మాయిల పెళ్లిళ్లు 33 శాతం ఉండగా, ఇప్పుడు 29.3 శాతంగా ఉన్నాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సమయంలో రాష్ట్రంలో 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సుగల పెళ్లి చేసుకున్న మహిళలు అప్పటికే తల్లి కావడం కానీ, గర్భంతో ఉండటం గానీ గుర్తించారు. వీరి శాతం పట్టణాల్లో 9.3 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 14.1గా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 18 ఏళ్లకన్నా ముందుగానే 37.3 శాతం మంది అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకున్నట్లు సర్వే తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 22.1 శాతం ఈ తరహా పెళ్లిళ్లు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 41.6 శాతం, బీహార్‌లో 40.8 శాతం 18 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లిళ్లు అయినట్లు సర్వే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment