Child offender
-
యూట్యూబ్ తెలివి.. వయసు 17, మోసాలు 16.. ఏటీఎం పిన్ నెంబర్ తెలుసుకుని..
చిత్తూరు అర్బన్: అతడి వయసు 17 ఏళ్లు. 16 కేసుల్లో నిందితుడు. అవి కూడా ఏటీఎం కేంద్రాలకు డబ్బులు తీసుకోవడానికి వచ్చేవారే లక్ష్యంగా చేసిన మోసాలు. ఇప్పటివరకు రూ.10.52 లక్షలు కొట్టేశాడు. ఈ బాల నేరస్థుడిని శుక్రవారం చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ చేసే బైకు, ఏటీఎం కార్డులు, రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ నరసింహరాజు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జు గ్రామానికి చెందిన యువకుడు (17) మాట వినకపోవడంతో తల్లిదండ్రులు వదిలేశారు. సులభంగా డబ్బులు సంపాదించడానికి మోసాలు చేయడం ఎలాగో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న అతడు ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చే వృద్ధులను లక్ష్యంగా చేసుకునేవాడు. డబ్బులు విత్‌డ్రా చేసిస్తామని చెప్పి అసలైన కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకునేవాడు. వారికి నకిలీ ఏటీఎం కార్డును తిరిగి ఇచ్చేవాడు. ఇలా 2018 నుంచి తెలంగాణలోని మలక్‌పేట, సంగారెడ్డిలతోపాటు మన రాష్ట్రంలో వైజాగ్, అమలాపురం, పాలకొల్లు, విజయనగరం, బాపట్ల, టంగుటూరు, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, తణుకు ప్రాంతాల్లో ఏటీఎం కార్డులతో మోసాలకు పాల్పడి రూ.10.52 లక్షలను పలువురి ఖాతాల్లోంచి కాజేశాడు. వచ్చిన డబ్బుతో విమానాల్లో తిరుగుతూ స్లార్ హోటళ్లలో బసచేస్తూ జల్సా చేసేవాడు. గతనెల చిత్తూరులో ఏటీఎం వద్ద ఒక వృద్ధురాలి కార్డు తీసుకుని పారిపోయాడు. వృద్ధురాలి ఖాతా నుంచి రూ.70 వేలు డ్రా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని తిరుపతి జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితుడు గతంలో విశాఖ హోమ్ నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. -
బాలుడు కాదు.. మహా ముదురు!
నల్లగొండ : జల్సాలకు అలవాటు పడిన ఒక బాలుడు దొంగతనాల బాట పట్టాడు. గతంలోనే ఇలాంటి తప్పు చేసి జైలు శిక్ష అనుభవించినా... తన పంథా మార్చుకోకుండా జైలు నుంచి బయటకు వచ్చాక కూడా మళ్లీ దొంగతనాలు మొదలెట్టాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడు కనపడటంతో అతన్ని విచారించారు. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు బయటకువచ్చాయి. ఫోన్ కనిపిస్తే చాలు.. అతడు చదువుకుంది ఏడో తరగతే. కానీ విలువైన ఫోన్ కనిపిస్తే చాలు.. దాన్ని మాయం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తే.. విశ్వ ప్రయత్నం చేసైనా లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను మాయం చేస్తాడు. దీని కోసం చువ్వలను వంచడం, కిటికీల నుంచి లోపలికి దూరడం వంటి వాటి కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తుంటాడు. పట్టణంలోని ఎన్జీ కాలనీకి చెందిన తట్ల సుభాష్ చంద్రబోస్(14) చిన్నప్పటి నుంచి జల్సాలకు అలవాటుపడి అక్రమంగా డబ్బు సంపాదించాలనే కోరికతో చోరీల బాట పట్టాడు. ఆశ్చర్యకరమైన నిజాలు.. చోరీలు చేసిన సొత్తు ఏం చేశావని పోలీసులు బాలుడిని విచారించగా.. వేశ్యల కోసం వెచ్చించేవాడినని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఒక్కరోజుకు ఒక మహిళకు రూ.10 వేలు ఇచ్చేవాడినని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చోరీ సొత్తును ఇంట్లో ఇచ్చేవాడివా అని పోలీసులు ప్రశ్నించగా.. ఇంటికి డబ్బు తీసుకెళితే.. ఇది ఎక్కడిది అని తండ్రి ఆరా తీసేవాడని, అందుకే ఇంటికి వెళ్లకుండా వేశ్యల దగ్గరకు వెళ్లే వాడినని తెలిపాడు. 6 తులాల బంగారం, రూ.60 వేల నగదు.. జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్న బాలుడి నుంచి పోలీసులు 6 తులాల బంగారం, రూ. 60 వేల నగదు, 300 గ్రాముల వెండి గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని వరంగల్‌లోని జువైనల్ హోంకు తరలిస్తామని తెలిపారు.