బాలుడు కాదు.. మహా ముదురు!
నల్లగొండ : జల్సాలకు అలవాటు పడిన ఒక బాలుడు దొంగతనాల బాట పట్టాడు. గతంలోనే ఇలాంటి తప్పు చేసి జైలు శిక్ష అనుభవించినా... తన పంథా మార్చుకోకుండా జైలు నుంచి బయటకు వచ్చాక కూడా మళ్లీ దొంగతనాలు మొదలెట్టాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడు కనపడటంతో అతన్ని విచారించారు. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు బయటకువచ్చాయి.
ఫోన్ కనిపిస్తే చాలు..
అతడు చదువుకుంది ఏడో తరగతే. కానీ విలువైన ఫోన్ కనిపిస్తే చాలు.. దాన్ని మాయం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తే.. విశ్వ ప్రయత్నం చేసైనా లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులను మాయం చేస్తాడు. దీని కోసం చువ్వలను వంచడం, కిటికీల నుంచి లోపలికి దూరడం వంటి వాటి కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తుంటాడు. పట్టణంలోని ఎన్జీ కాలనీకి చెందిన తట్ల సుభాష్ చంద్రబోస్(14) చిన్నప్పటి నుంచి జల్సాలకు అలవాటుపడి అక్రమంగా డబ్బు సంపాదించాలనే కోరికతో చోరీల బాట పట్టాడు.
ఆశ్చర్యకరమైన నిజాలు..
చోరీలు చేసిన సొత్తు ఏం చేశావని పోలీసులు బాలుడిని విచారించగా.. వేశ్యల కోసం వెచ్చించేవాడినని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. ఒక్కరోజుకు ఒక మహిళకు రూ.10 వేలు ఇచ్చేవాడినని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చోరీ సొత్తును ఇంట్లో ఇచ్చేవాడివా అని పోలీసులు ప్రశ్నించగా.. ఇంటికి డబ్బు తీసుకెళితే.. ఇది ఎక్కడిది అని తండ్రి ఆరా తీసేవాడని, అందుకే ఇంటికి వెళ్లకుండా వేశ్యల దగ్గరకు వెళ్లే వాడినని తెలిపాడు.
6 తులాల బంగారం, రూ.60 వేల నగదు..
జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్న బాలుడి నుంచి పోలీసులు 6 తులాల బంగారం, రూ. 60 వేల నగదు, 300 గ్రాముల వెండి గ్లాసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని వరంగల్‌లోని జువైనల్ హోంకు తరలిస్తామని తెలిపారు.