చిత్తూరు అర్బన్: అతడి వయసు 17 ఏళ్లు. 16 కేసుల్లో నిందితుడు. అవి కూడా ఏటీఎం కేంద్రాలకు డబ్బులు తీసుకోవడానికి వచ్చేవారే లక్ష్యంగా చేసిన మోసాలు. ఇప్పటివరకు రూ.10.52 లక్షలు కొట్టేశాడు. ఈ బాల నేరస్థుడిని శుక్రవారం చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ చేసే బైకు, ఏటీఎం కార్డులు, రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ నరసింహరాజు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జు గ్రామానికి చెందిన యువకుడు (17) మాట వినకపోవడంతో తల్లిదండ్రులు వదిలేశారు. సులభంగా డబ్బులు సంపాదించడానికి మోసాలు చేయడం ఎలాగో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న అతడు ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చే వృద్ధులను లక్ష్యంగా చేసుకునేవాడు.
డబ్బులు విత్‌డ్రా చేసిస్తామని చెప్పి అసలైన కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకునేవాడు. వారికి నకిలీ ఏటీఎం కార్డును తిరిగి ఇచ్చేవాడు. ఇలా 2018 నుంచి తెలంగాణలోని మలక్‌పేట, సంగారెడ్డిలతోపాటు మన రాష్ట్రంలో వైజాగ్, అమలాపురం, పాలకొల్లు, విజయనగరం, బాపట్ల, టంగుటూరు, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, తణుకు ప్రాంతాల్లో ఏటీఎం కార్డులతో మోసాలకు పాల్పడి రూ.10.52 లక్షలను పలువురి ఖాతాల్లోంచి కాజేశాడు.
వచ్చిన డబ్బుతో విమానాల్లో తిరుగుతూ స్లార్ హోటళ్లలో బసచేస్తూ జల్సా చేసేవాడు. గతనెల చిత్తూరులో ఏటీఎం వద్ద ఒక వృద్ధురాలి కార్డు తీసుకుని పారిపోయాడు. వృద్ధురాలి ఖాతా నుంచి రూ.70 వేలు డ్రా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని తిరుపతి జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితుడు గతంలో విశాఖ హోమ్ నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment