బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
అందరి మన్నలు అందుకుంటున్న చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ సీతారాం
నేడు బాల కార్మిక దినం
విశాఖపట్నం : స్మార్ట సిటీగా రూపుదిద్దుకునేందుకు వేగంగా పరుగులు తీస్తున్న విశాఖ నగరంలో బాల కార్మిక వ్యవస్థ వేళ్లూనుకొని ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ గొండు సీతారాం బాలకార్మిక వ్యవస్థను రూపుమాపి, ప్రతి విద్యార్థిని బడికి పరిచయం చేసి, తద్వారా విశాఖ నగర అభివృద్ధికి పెద్ద పీట వేసేందుకు నిరంతరం తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో కలెక్టర్ చైర్మన్‌గా పని చేస్తున్న జాతీయ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూ ఎక్కడ బాలకార్మికులు ఉన్నా వారిని ఆ పని నుంచి విముక్తుల్ని చేస్తూ వారికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా జిల్లా స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు లభించాయి. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ అధ్యక్షురాలు శాంతా సిన్హా విశాఖ నగర కన్వీనర్‌గా సీతారామ్‌ను నియమించారు.
అప్పటి నుంచి ఆయన కార్మిక, విద్యాశాఖల అధికారులు, జాతీయన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులతో కలసి దుకాణాలు, పరిశ్రమలు, హోటళ్లు, కార్కానాలపై తరచూ దాడులు నిర్వహిస్తూ బాల కార్మికులకు విముక్తి కలిగిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రాత్రి బస, బాలల భోజన వసతులపై ఆరాాతీస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి, మానసిక, శారీరక వికలాంగ విద్యార్థులకు వైద్య ధ్రువీకరణ పత్రాల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు అధికారులతో సంప్రదించి తగిన ఏర్పాట్లు చేయిస్తున్నారు.
సేవలకు గుర్తింపు : సీతారాం సేవలను గుర్తించిన కలెక్టర్ యువరాజ్, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ ఈ ఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ బాలల హక్కుల రక్షణ సంస్థ అవార్డును సీతారాంనకు అందజేశారు. వుడా వీసీ బాబూరావు నాయుడు, ఆంధ్రాయూనివర్సిటీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు ఉగాది పురస్కారాన్ని అందజేశారు.