సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయాలి
కాజీపేట : ఆధునిక యుగంలో సేంద్రియ వ్యవసాయాన్ని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలవికాస సంస్థ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా జింగ్రాస్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్లోని బాలవికాస కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ శిబిరం ముగింపు సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ.. బాలవికాస నాలుగేళ్లుగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.
మొట్టమొదట గ్రామానికి ముగ్గురు రైతుల చొప్పున ప్రారంభమైన సేంద్రియ వ్యవసాయం నేడు 23 గ్రామాల్లో విస్తరించిందని, 450 మంది రైతులు ఈ వ్యవసాయంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు. బాలవికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి మాట్లాడుతూ బాలవికాస సంస్థ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తీరు గురించి తెలుసుకున్న కర్నూలు, రంగారెడ్డి, కడప, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులు తమకు అవగాహన కల్పించాలని కోరారని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 25, 26వ తేదీల్లో రైతులకు శిక్షణను ఇచ్చినట్లు తెలిపారు. రిటైర్డ్ జేడీఏ రామలింగం, బాల వికాస సిబ్బంది తిరుపతి తదితరులు పాల్గొన్నారు.