అంగన్వాడీల్లో ‘బాల స్వచ్ఛ వారోత్సవాలు’
ఇందూరు : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో ‘బాల స్వచ్ఛ వారోత్సవాలు’ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 19 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐసీడీఎస్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి.
ముఖ్యంగా ఆరు అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాల ని, రోజు వారీగా ఫోటోలను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఐసీడీఎస్ అధికారులను ప్రభుత్వాలు ఆదేశించాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, వారి తల్లులకు అవగాహన కల్పించాలని సూచించాలని, గ్రామాల్లో బ్యానర్లు, పోస్టర్ల ద్వారా కార్యక్రమాలపై ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ రాములు జిల్లాలోని పది ప్రాజెక్టుల సీడీపీఓలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 2,711 అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారులు కార్యాచరణ సిద్ధంచేస్తున్నారు.
ఆరు కార్యక్రమాలు ఇలా..
1 అంగన్వాడీల పరిశుభ్రత
అంగన్వాడీ కేంద్రాలలోని గదులను, పిల్లలు కూర్చుండే స్థలాన్ని పరిశుభ్రం చేయాలి. గదులకు పట్టిన దుమ్ము, ధూళిని తొలగించాలి. పిల్లలు ఆడుకునే వస్తువులను తుడవాలి. ఆహార ధాన్యాలు నిలువ ఉంచే గదిని శుభ్రం చేయాలి.
2 పరిసరాలు..
అంగన్వాడీ కేంద్రాల ఆరుబయట ప్రాంతాలలో, ఆటలాడుకునే స్థలంలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంలాంటివి లేకుండా చూసుకోవాలి. పిల్లలు కేంద్రానికి వచ్చేందుకు, ఆడకునేందుకు వీలుగా నేలను చదును చేయాలి. కీటకాలు, విష పురుగులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
3 వ్యక్తిగత శుభ్రత
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్సించాలి. ముఖ్యంగా పిల్లలను కార్యకర్తలు, ఆయాలు దగ్గరుండి వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. భోజనం చేసే ముందు, చేసిన తర్వాత, మల మూత్రాలకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను, కాళ్లను శుభ్రంచేసుకోవాలని సూచించాలి. ఆటలాడిన తర్వాత కూడా చేతులు, కాళ్లు, ముఖం కడుక్కునేలా తయారు చేయాలి.
4 ఆహార పదార్థాలు..
పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు ప్రతి రోజు వండిపెట్టే భోజనం పరిశుభ్రంగా ఉంచాలి. పప్పు లు, బ్యియం, నూనె, ఇతర వస్తువులను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. అప్పటికప్పుడు వండిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అధిక రోజులు నిల్వ ఉన్న గుడ్లను లబ్ధిదారులకు అందించరాదు.
5 తాగునీరు..
తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి క్లోరినేషన్ చేసిన, కాచి వడపోసిన, స్వచ్ఛమైన తాగునీటిని మాత్రమే అందించాలి. తాగునీటి పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఏ రోజు పట్టిన నీటిని ఆ రోజు మాత్రమే వాడాలి.
6 టాయిలెట్లు..
అంగన్వాడీ కేంద్రాల్లో కచ్చితంగా టాయిలెట్లు ఉండేవిధంగా చూడాలి. టాయిలెట్లలో నీటి సదుపాయం కల్పించాలి. మల విసర్జన తర్వాత నీటిని పోయాలి. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు ఆసిడ్‌తో శుభ్రంగా కడగాలి.