బాలల సంక్షేమ సంస్థకు తెలుగు చిన్నారులు
భివండీ, న్యూస్‌లైన్: ఆరు రోజుల క్రితం తల్లి వదిలేసి పోయిన నలుగురు తెలుగు చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది. కన్నతల్లి జాడే తెలియకపోగా, కన్నతండ్రి కనీసం చూసేందుకు కూడా రాలేదు. అయితే ‘సాక్షి’ చొరవతో అయిదు రోజుల అనంతరం పిల్లలను తీసుకుపోయేందుకు మేనమామ వచ్చారు.
కానీ ‘బాల్ కల్యాణ్ సమితి’ (బాలల సంక్షేమ సంస్థ) పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారిని అప్పగించేందుకు నిరాకరించింది. ఆ పిల్లలను రెండు రోజుల్లో మహబూబ్‌నగర్ జిల్లాలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బోయ రాజేశ్వరి (9), బోయ స్వప్న (7), బోయ అఖిల (5), బోయ మహాలక్ష్మి (3)లను వారి కన్నతల్లి డిసెంబరు 31వ తేదీ తెల్లవారజామున కల్యాణ్ బస్‌స్టాండ్‌లో వదిలిపెట్టిపోయిన సంగతి తెల్సిందే.
వీరిని పోలీసులు స్థానిక బాలల సంక్షేమ కేంద్రానికి పంపించారు. ఈ సంఘటన జరిగిన అయిదు రోజుల అనంతరం పిల్లలను తీసుకుపోయేందుకు వారి తల్లి బోయ సుజాత సోదరుడైన చంద్రకంటి ఆంజనేయులు, మరో గ్రామస్థుడు జోగి నారాయణ సోమవారం కల్యాణ్ చేరుకున్నారు. మహాత్మఫులే పోలీసు స్టేషన్లో అన్ని వివరాలను అందించిన వీరిని పోలీసులు పిల్లలనుంచిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్దకు తీసుకెళ్లారు.
అయితే పిల్లలను మేనమామ ఆంజనేయులుకు అప్పగించేందుకు కమిటీ అధ్యక్షురాలు మీనల్ ఠాకోర్, సభ్యురాలు విద్యా ఆటపాడ్కర్, సభ్యుడు కిరణ్ మోరేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంజనేయులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, పిల్లలను తీసుకుపోయేందుకు తండ్రి రాలేదని, తదితర కారణాల చూపుతూ వారిని అప్పగించేందుకు నిరాకరించారు. ఆ నలుగురు పిల్లలను తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆనందంనుంచి తేరుకునేలోపే....
అయిదు రోజులుగా అయినవారు కనిపించక బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులు ఊరి నుంచి వచ్చిన మేనమామను చూసి ఒక్కసారిగా ఆనందంతో తబ్బిబ్బయ్యారు. వారి ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. తమను ఊరికి తీసుకెళ్లమంటూ మేనమామ వద్ద గోళ చేశారు. అయితే చైల్డ్వెల్ఫేర్ కమిటీ వారిని అప్పగించేందుకు నిరాకరించడంతో పిల్లల ముఖాల్లో విషాదం నిండుకుంది.
అప్పటివరకు ఆనందంగా గడిపిన పిల్లలు మళ్లీ సంక్షేమ కేంద్రానికి వెళ్లేందుకు నిరాకరించారు. మేనమామతో కలిసి అమ్మమ్మ దగ్గరికి వెళ్తామంటూ చేసిన వారి రోదనలు అక్కడ చేరిన వారిలో కంటతడిపెట్టించాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటి ఆదేశానుసారం రెండు రోజుల్లో పిల్లలను మహబూబ్‌నగర్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటికి అప్పగిస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ నిషార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.