Childline members
-
చైల్డ్‌లైన్ అదుపులో 8 మంది చిన్నారులు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : పలు ప్రాంతాల నుంచి తప్పిపోయి, పారిపోయి వచ్చిన 8మంది చిన్నారులను గురువారం ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పట్టుకుని చైల్డ్ లైన్‌కు అప్పగించారు. చైల్డ్‌లైన్ సిబ్బంది తెలియజేసిన వివరాల ప్రకారం... పలాస, కాశీబుగ్గ నుంచి ఒక అమ్మాయి, అబ్బాయి(ఇద్దరు మైనర్లు) ప్రేమించుకుని, ఇంటి నుంచి పారిపోయి విశాఖపట్నం వచ్చేశారు. ఇక్కడి రైల్వేస్టేషన్లో మూడు రోజుల నుంచి ఉండడంతో జీఆర్పీ పోలీసులు గమనించి విచారించారు. ముందు అబ్బాయి తండ్రికి బాగోకపోవడంతో కేజీహెచ్‌లో చేర్చామని, అందుకే ఇక్కడ ఉన్నామని చెప్పారు. అనంతరం పోలీసులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పారు. వీరి తల్లిదండ్రులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాలుడి తండ్రి తెలిపారు. సామర్లకోటకు చెందిన అశోక్(14) చదువు ఇష్టం లేక, మధ్యలోనే మానేసి ఇంటి దగ్గర ఉంటున్నాడు. అతని తండ్రి షాపులో పని నిమిత్తం పెట్టగా, పని చేయడం ఇష్టం లేక పారిపోయి వచ్చేశాడు. బిహార్‌కు చెందిన ఎండీ అఖిల్‌అంజుమ్(14), ఎండీ రిజ్వాన్(11)మదర్సాలో చేరేందుకు ఇంటి వద్ద చెప్పకుండా వచ్చేశారు. 13 సంవత్సరాల బాలుడు వాసు తన మామయ్యతో కలిసి రాజమండ్రికి హాస్టల్లో చేరేందుకు వెళ్తున్నట్లు... మామయ్య ట్రైన్ ఎక్కేయగా, తాను మిస్ అయినట్లు తెలియజేశాడు. విజయనగరం జిల్లా తెర్లాం ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు యం.ఈశ్వర్(12), యం.లక్ష్మణ్(10)చెన్నై వెళ్లిపోవాలని ఇంటి దగ్గర ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం వచ్చేశారు. వీరందరినీ అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, వారంతా శుక్రవారం రానున్నట్లు చైల్డ్‌లైన్ సిబ్బంది తెలిపారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు మెంబర్ శ్యామ్‌కుమార్ రైల్వేస్టేషన్‌కు చేరి పిల్లలందరికీ రక్షణ కల్పించేందుకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంచినట్లు చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ జాన్‌పీటర్ తెలియజేశారు. -
బాల్య వివాహంపై ఫిర్యాదు
విజయనగరం ఫోర్ట్ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అధికారులు పదేపదే చెబుతున్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసులో తాళి కట్టేస్తున్నారు. శుక్రవారం జరిగిన వివాహంలో ఇద్దరూ మైనర్లు కావడం విశేషం. దీంతో బాల్యవివాహా నిరోధక అధికారులు పట్టణంలోని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలికకు విశాఖపట్నం కంచరపాలెంనకు చెందిన 18 ఏళ్ల బాలుడికి కంటోన్మెంట్‌లోని బాపిస్టు చర్చిలో వివాహం జరిగింది. అయితే ఈ విషయాన్ని అజ్ఞాత వ్యక్తి ఒకరు చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1098కు సమాచారం అందించారు. ఈ సమాచారాన్ని చైల్డ్‌లైన్ సభ్యులు బాల్యవివాహా నిరోధక అధికారులకు తెలియజేశారు. వెంటనే బాల్య నిరోధక అధికారులు, పోలీసులు, బాలల సంక్షేమ కమిటీ, చైల్డ్‌లైన్, డీసీపీయూ సభ్యులు వివాహం జరిగిన చర్చి వద్దకు వెళ్లారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని చెప్పి వారిని చైల్డ్‌లైన్ కార్యాలయానికి తీసుకుని వచ్చి బాలల సంక్షేమకమిటీ ముందు ప్రవేశ పెట్టారు. బాల్య వివాహ నిరోధక అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్, సభ్యులు పట్నాయక్, వరలక్ష్మి, సుధ, చిట్టియ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధిక, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ రంజిత, యాళ్ల నాగరాజు, పాల్గొన్నారు. -
చిన్నారిని చితక బాదిన సవతి తల్లి
అనంతపురం (గుత్తి): నాలుగేళ్ల చిన్నారిని సవతి తల్లి చితకబాదింది.విషయం తెలుసుకున్న 1098 చైల్డ్‌లైన్ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ సంఘటన గుత్తి ఆర్ఎస్లో శుక్రవారం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన హీరాలాల్,సంతోషి గత ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.వీరికి రేణుక జన్మించింది.పాప పుట్టిన తర్వాత సంతోషిని భర్తను వదిలేసింది. దీంతో హీరాలాల్ రాజస్తాన్ నుంచి గుత్తికి మకాం మార్చాడు. చిన్నారి రేణుకను తన వద్దే ఉంచుకున్నాడు.అయితే గత రెండు మాసాల క్రితం హీరాలాల్ రాజస్తాన్‌కు చెందిన కిరణ్రాథోడ్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో సవతి తల్లి కిరణ్ రాథోడ్ చిన్నారి రేణుకను చితకబాదడం మొదలు పెట్టింది. తరుచూ చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసింది. ఈ విషయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 1098 చైల్డ్‌లైన్ సభ్యులు మురళికి సమాచారం అందింది.దీంతో మురళి తన తోటి సభ్యులు రామకృష్ణ,అశ్వని,అంగన్వాడీ సూపర్వైజర్ శకుంతలతో కలిసి గుత్తి ఆర్ఎస్లోని పత్తికొండ రోడ్డులో ఉన్న హీరాలాల్ ఇంటికి వెళ్లారు.చిన్నారిని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా మా బిడ్డ మా ఇష్టమని మొదట దబాయించారు.పోలీసులకు చెబుతామని అనడంతో అసలు చిన్నారిని కొట్టలేదని సవతి తల్లి కిరణ్రాథోడ్ అడ్డం తిరిగింది.ప్రమాదవశాత్తు కింద పడి దెబ్బలు తగిలాయని బుకాయించింది.అయితే పానీ పూరిని తయ్యారు చేసే గరిట(చెలాకి)తో చిన్నారిని కొట్టినట్లు చెంపపై గాయాలున్నాయి.వీపు పై కూడా బలంగా కొట్టిన గుర్తులున్నాయి.చెంబ,వీపుపై దెబ్బలుండటంతో 1098 సభ్యులు వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి చిన్నారి తండ్రి హీరాలాల్,సవతి తల్లి కిరణ్ రాథోడ్‌లపై ఫిర్యాదు చేశారు.పోలీసులు వారిరువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.